Doctors Continue Protest Across the State : కోల్‌కతాలో వైద్యవిద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, విద్యార్థులు రోడ్డెక్కారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తేల్చిచెప్పారు.
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, విద్యార్థులు కతం తొక్కారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో వైద్యరంగ నిపుణులు, విద్యార్థులు, వివిధ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు భారీ ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండా పట్టుకుని నడుస్తూ 'we want justice' అంటూ నినదించారు.
దేశంలో ఓపీ సేవలు బంద్! నేషన్వైడ్ నిరసనకు IMA రెడీ- దిల్లీలో రెసిడెంట్ డాక్టర్స్ ఆందోళనలు
నంద్యాలలో పీజీ వైద్య విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు నిరసనలు ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్విమ్స్ వద్ద టెంట్ వేసుకుని కూర్చుని ప్లకార్డులతో దీక్ష చేశారు. ప్రాణాలు కాపాడే డాక్టర్‌పై హత్యాచారాలు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.