Doctor Social Services In Khammam : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో మూరుమూల గ్రామం కేసుపల్లి గ్రామంలో 2005 వరకు సరైన రహదారే లేదు. ఐదో తరగతి వరకు చదివి ఉన్నత పాఠశాలకు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన శెట్టిపల్లి నాగేశ్వరరావుపదో తరగతి వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ పూర్తి చేసి ఖమ్మంలో ఆసుపత్రి నెలకొల్పారు. కొద్ది కాలంలోనే మంచి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకొని తాను పుట్టిన ఊరు స్థితిగతులను మార్చాలని వైద్యుడు సంకల్పించారు.
Doctor Nagasawar Rao Free Treatment To Villagers :చిన్నతనంలో విద్య, వైద్యం కోసం తాను ఎదుర్కొన్న సమస్యలు మరెవరూ ఎదుర్కోవద్దనుకున్నారు. తల్లిదండ్రులు నారాయణ, బసవమ్మ మెమోరియల్ ట్రస్టు పేరుతో విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలకు డబ్బును వెచ్చిస్తున్నారు. దాదాపు 15 ఏళ్ల నుంచి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ కేసుపల్లి శ్రీమంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుట్టిన ఊరు కేసుపల్లితో పాటు మండలంలోని చాలా గ్రామాల్లో అభివృద్ధి, విద్య, వైద్యం కోసం సొంతంగా కోటి రూపాయలు ఖర్చు చేశారు.
4 ప్రభుత్వ ఉద్యోగాలను ఒడిసిపట్టిన వరంగల్ కుర్రాడు
గ్రామ అభివృద్ధిలోనే కాదు ప్రజలను పర్యావరణ హితం వైపు అడుగులు వేయించేందుకు తన వంతు కృషి చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఇంటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు లక్షకు పైగా మొక్కలు నాటించి వాటి సంరక్షణకు ఇనుప బుట్టలు ఏర్పాటు చేయించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రకృతి వనాలకు కొబ్బరి మొక్కలు, పూల మొక్కలు అందించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సాయం అందించారు. సొంతూరిలో సదుపాయాలు కల్పిస్తూనే తన సేవలు మండల స్థాయికి విస్తరింపజేశారు. మండల ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పిస్తున్న ఏన్కూరులోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో మెరుగైన చికిత్సలకు అవసరమైన సదుపాయాలు సమకూర్చారు. రూ. 5లక్షల రూపాయలతో ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేశారు.