Distribution Of Sarees In Jagtial: ఆడ పిల్ల పుడితే భారంగా భావిస్తుంటారు కొంతమంది. అమ్మాయి పుట్టింది అనగానే బాధపడతారు. తమపై దించుకోలేని భారం పడిందని భావిస్తుంటారు. ఆడపిల్ల పుట్టింది అనగానే సంతోషం కంటే ఎక్కువగా విసుక్కుంటుంటారు. ఆడపిల్ల పుడితే అరిష్టమని, మనకిది శాపమని భావించేవాళ్లూ ఉన్నారు. మగ పిల్లవాడు పుడితే వారసుడు వచ్చాడంటూ సంబురాలు జరుపుకునే వారినీ చూస్తుంటాం. అమ్మాయి కంటే అబ్బాయికే ఎక్కువ విలువ ఇస్తారు చాలా మంది.
ఈ వివక్ష ప్రస్తుతం అనేక చోట్ల ఉంది. అయితే ఆడపిల్ల పుడితే ఇతడు మాత్రం ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఊరంతా చీరలు పంచి వేడుక చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో ఓగులపు అజయ్ అనే యువకుడు తనకు ఆడ పిల్ల పుట్టిందని ఊర్లో ఉన్న ప్రతి మహిళకు చీరల పంపిణీ చేశాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఇంట్లో సంబురాలు నిర్వహించారు. దాదాపు 1500 చీరలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ కార్యక్రమం పూర్తి చేశారు. ఆడ పిల్ల అంటే మహాలక్ష్మి అని, సంతోషంగా చీరలను పంపిణీ చేసినట్లు అజయ్ తెలిపాడు.