Dharmapuri Srinivas Last Rites With Formalities : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లో ఆదివారం డీఎస్ అంత్యక్రియలు జరగనుండగా, అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
డీఎస్ పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం దిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం భౌతిక కాయాన్ని నిజామాబాద్‌కు తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్‌కు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ కన్నుమూత - ధర్మపురి అర్వింద్ భావోద్వేగ పోస్ట్ - D Srinivas passed away