DHANURMASAM Special :తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. స్వామివారికి ప్రతినిత్యం నిర్వహించే సుప్రభాతం బదులు ధనుర్మాసంలో నెల రోజులు మాత్రం తిరుప్పావై నివేదిస్తారు. మంగళవారం వేకువ జామున నుంచి ప్రారంభమై తిరుప్పావై నివేదన జనవరి 14 వరకు జరగనుంది. ఆండాళ్ రచించిన 30 పాశురాలను రోజుకు ఒకటి చొప్పున 30 రోజులపాటు నివేదిస్తారు. ధనుర్మాసంలో భోగశ్రీనివాసమూర్తికి బదులు శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవను నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. అందుకే ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దైవ ప్రార్థనకు అనుకూలం, తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటి వాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పినట్టు పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు నిర్వహించరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.
తిరుమల కొండల్లో "పాలధారలు'' - మైమరచిపోతున్న భక్తులు
కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ (గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని స్థుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం.