Fire accident at Madanapally RDO office : మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్ అని భావిస్తున్నాం అని డీజీపీ ద్వారకా తిరుమల రావు వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి 11.30 గం.కు ఆర్డీవో కార్యాలయంలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, ఫైర్ ఇన్సిడెంట్ సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. ఆర్డీవో కార్యాలయంలో 22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, కీలక దస్త్రాలు ఉన్న విభాగంలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదన్న డీజీపీ, స్థానిక సీఐతో పాటు ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయని, ఘటనపై దర్యాప్తు కోసం పది బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. మదనపల్లె అగ్ని ప్రమాద ఘటనలో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోందని డీజీపీ చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ కాదని, ఫైర్ ఇన్సిడెంట్ అని ఘటన తీరును బట్టి చూస్తే ఇన్సిడెంట్‌గానే భావిస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో వీఆర్‌ఏ ఒక్కడే ఉన్నాడని, ఘటనపై వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు.
షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేదన్న అధికారులు :ఆర్డీఓ ఆఫీసులో కీలక సెక్షన్‌లో ఇన్సిడెంట్ జరగడం అనుమానాలకు తావిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని విచారణలో తేలిందని, ఇక్కడ ఓల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ప్రాథమిక విచారణలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని, ఆర్డీవోకు తెలిసినా వెంటనే కలెక్టర్‌కు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎస్‌ఐ కూడా ఉన్నతాధికారులకు వెంటనే చెప్పలేదని పేర్కొన్నారు. కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయన్న డీజీపీ, షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేదని ఫోరెన్సిక్ వాళ్లు చెప్పారని, కాగా ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు కొన్ని జరిగాయని వెల్లడించారు.