Karthika Masam 2024 :కార్తిక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అత్యంత పవిత్రమైన కార్తిక మాసం శనివారం నాడు ప్రారంభమైంది. ఇది నవంబర్ 30న ముగుస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కార్తిక శోభ వెల్లివిరిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు కిటకిటలాడాతున్నాయి. శివాలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నదుల్లో పుణ్యస్నానాల అనంతరం మహిళలు దీపాలంకరణ చేయడం దేవాలయ ప్రాంగణాలు కాంతులతో వెల్లువిరిశాయి. ఉపవాస దీక్షలు, అభిషేకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కార్తిక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యమ ద్వితీయను పురస్కరించుకుని జగన్మాతను 4 లక్షల గాజులతో సర్వాంగసుందరంగా అలకంరించారు. సోదరి తన సోదరుడ్ని పిలిచి భోజనం పెట్టే పండుగగా పండితులు అభివర్ణిస్తున్నారు. సాక్ష్యాత్తు యమ ధర్మరాజు తన సోదరి ఇంటికెళ్లి భోజనం చేసి పసుపు, కుంకుమతోపాటు గాజులిచ్చి సౌభాగ్యంగా ఉండు అని దీవించారని చెబుతున్నారు.
Devotees Rush Karthika Masam : నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు పాతాళ గంగలో పుణ్య సాన్నాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉత్తర మాడ వీధి, గంగాధర మండపం వద్ద భక్తులు దీపారాధనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.