Devotees Abhishekam To Ganesha With 2000kgs Sugar in Jagtial :వినాయక పండుగ వచ్చిందంటే సందడే సందడి. ప్రతి గల్లీలో వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తమ భక్తిని చాటుకుంటుంటారు. గణేశ్ నవరాత్రులంతా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రోజూ ప్రత్యేకంగా అలంకరించి, వివిధ రకాల నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ మధ్యకాలంలో ప్రకృతి పట్ల అవగాహన పెరిగి మట్టి వినాయకులను ప్రతిష్ఠించడానికి మక్కువ చూపిస్తున్నారు ప్రజలు. వీరు కూడా అటు ప్రకృతిని కాపాడుతూ, మరోవైపు భక్తుల కోర్కెలు తీరడానికి గణేశుడికి రోజుకో అభిషేకం చేస్తున్నారు. అందులో చక్కెరాభిషేకం మరీ ప్రత్యేకం. మరి దాని గురించి తెలుసుకుందామా?
క్యూలో నిలబడి చక్కెర అభిషేకం :జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధర్వంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. తొమ్మిది రోజుల పాటు రోజుకో రకమైన అభిషేకాలు చేస్తూ అందరిలో భక్తి భావాన్ని చాటుతున్నారు. ఇందులో భాగంగా ఆరో రోజు ఏకదంతునికి చక్కెరాభిషేకాన్ని నిర్వహించారు. ఈ అభిషేకంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్యూలైన్లలో నిలబడి వెండి వినాయకుని మూర్తికి చక్కెర అభిషేకం చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఇలా భక్తులు అభిషేకించిన చక్కర సుమారు 20 క్వింటాళ్లకు పైనే జమ కావడం చూస్తుంటే, చక్కరాభిషేకం ఏ విధంగా జరిగిందో తెలుస్తుంది.