Devaragattu Bunny Festival 2024 : దేవరగట్టు కర్రల సమరంలో ఎలాంటి హింస జరగకుండా ఆపేందుకు పోలీసులు ముందస్తుగా చేపట్టిన చర్యలు ఫలించలేదు. అధికారులు వేసిన ప్రణాళికలు ఫలితాలివ్వలేదు. దీని ఫలితంగా కర్రల సమరంలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తరలించగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ఏటా దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో కర్రల సమరం ఉంటుంది. అంటే కర్రలతో రెండు గ్రూపులు కొట్టుకుంటాయి. ఈ కర్రల సమరంలో ఈసారి వేడుకల్లో 70 మంది గాయపడ్డారు. దేవతామూర్తుల కోసం ఈ కర్రల సమరం జరుగుతుంది. హింసకు తావులేకుండా బన్ని ఉత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేదు. ఈసారి కూడా ఎప్పటిలాగే హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో 70 మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
అసలేంటీ బన్నీ ఉత్సవం :దసరా సందర్భంగా కర్రల దేవరగట్టు ప్రజలు కర్రల సమరాన్ని దశబ్దాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఏటా జరిపే ఈ ఉత్సవం ఆనవాయితీగా వస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాళమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఎప్పటిలాగే దేవతామూర్తులైన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహించారు. అనంతరం కొండకు సమీప ప్రాంతాల్లో పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్న గుడి మీదుగా దివిటీల వెలుగుల్లో ఆ దేవతామూర్తుల విగ్రహాలను ఊరేగించారు. ఈ సందర్భంగా దేవతా మూర్తుల విగ్రహాలను దక్కించుకోవడమే లక్ష్యంగా 5 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, మరో 3 గ్రామాల ప్రజలు ఇంకో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగుతారు. దీనినే దేవరగట్టు కర్రల పోరు అంటారు.