తెలంగాణ

telangana

షాద్‌నగర్‌ ఘటన - సీఐతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ - Shadnagar Incident Latest Update

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 4:30 PM IST

Updated : Aug 5, 2024, 4:36 PM IST

Six Policemen Suspended in Shadnagar Incident : షాద్‌నగర్‌ ఘటనలో డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డితో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌కు గురయ్యారు. చోరీ కేసులో సునీత అనే మహిళను పీఎస్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టినట్లు వచ్చి ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ రంగస్వామి ఘటనపై విచారణ జరిపారు. అనంతరం నివేదికను సైబరాబాద్‌ సీపీకి సమర్పించగా, నివేదిక ఆధారంగా సీఐతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Shadnagar Police Station
Shadnagar Incident (ETV Bharat)

Shadnagar Incident Update : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దొంగతనం కేసులో మహళ, ఆమె భర్త, కుమారుడిని ఠాణాకు తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దీనికి బాధ్యుడైన డిటెక్టివ్ సీఐ రామిరెడ్డితో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. షాద్‌నగర్ ఠాణాలో పని చేస్తున్న కానిస్టేబుళ్లు జాకీర్, రాజు, మోహన్ లాల్, అఖిల, కరుణాకర్‌లను సీపీ సస్పెండ్ చేశారు. దీంతో పాటు ఘటనపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అవినాశ్‌ మహంతి తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే? రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన దళిత మహిళను పోలీసులు ఠాణాలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దళితవాడలో నివాసముండే పీఎంపీ వైద్యుడు నాగేందర్‌ జులై 24న తన ఇంట్లో 22.5 తులాల బంగారం, రూ.2 లక్షలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేందర్‌ ఇంటికెదురుగా ఉంటూ కూలీ చేసుకునే భీమయ్య, సునీత దంపతుల్ని జులై 26న డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డి విచారణ కోసమని స్టేషన్‌ పిలిచారు. చోరీ చేయలేదని చెప్పడంతో వదిలేశారు.

ఖాకీల కర్కశత్వం - దొంగతనం ఆరోపణలతో ఎస్సీ మహిళపై విచక్షణరహితంగా దాడి - Police Crushed Accused Woman

అయితే మళ్లీ 30న రాత్రి 9 గంటలకు సునీతను ఠాణాకు తీసుకెళ్లిన పోలీసులు నేరం అంగీకరించాలని చిత్రహింసలకు గురి చేశారని చెబుతోంది. ఒప్పుకోకపోవడంతో తన 13 ఏళ్ల కుమారుడి కళ్ల ముందే విచక్షణారహితంగా కొట్టినట్లు తెలుస్తోంది. దెబ్బలు తాళలేక బాధితురాలు స్పృహ తప్పి పడిపోవడంతో ఫిర్యాదుదారు వాహనంలోనే ఇంటికి పంపారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.

బాధ్యులపై చర్యలకు రేవంత్ ఆదేశం :దళిత మహిళపై పోలీసుల దాడి ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించిన సీఎం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్​స్పెక్టర్‌ను ఇప్పటికే కమిషనరేట్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసిన సీపీ అవినాశ్‌ మహంతి, తాజాగా ఆయనతో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దళిత మహిళపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి - సమగ్ర విచారణకు ఆదేశం - SHADNAGAR DALIT WOMAN TORTURE CASE

Last Updated : Aug 5, 2024, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details