Pawan Kalyan visit Manyam and Alluri Districts: దశాబ్దాల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అల్లూరి, పార్వతీపురం జిల్లాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు సమస్యలకు ఇక ముగియనున్నాయి. గ్రామాల్లో సరైన రోడ్లు లేక గత 3 ఏళ్లలో దాదాపు 21 డోలి మోతలు జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఆ గ్రామాల్లో రొడ్లు నిర్మించనున్నారు. అయితే ఈ రహదారుల నిర్మాణంతో డోలీ కష్టాలకు ప్రభుత్వం ముగింపు పలకనుంది.
క్షేత్రస్థాయిలో పర్యటించిన పవన్ కల్యాణ్: రెండున్నర ఏళ్లలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆరు నెలల్లో ప్రణాళిక తయారుచేసి పనులు ప్రారంభిస్తామనీ హామీ ఇచ్చారు. శుక్రవారం మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణానికి మక్కువ మండలం బాగుజోలు నుంచి శ్రీకారం చూట్టారు. బాగుజోలు - సిరివరం రహదారికి రూ.9 కోట్ల అంచనాతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. రహదారి నిర్మాణానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో పవన్ మాట్లాడుతూ గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా గిరిజనుల బాగు కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. 4 వేల గిరిజన తండాల్లో రోడ్లు వేయాలని సీఎంను అడిగానని తెలిపారు.
రోడ్లను నేనే స్వయంగా పర్యవేక్షిస్తా:గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అలానే గిరిజన పిల్లలంతా బాగా చదువుకోవాలని పవన్ కోరారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఇక్కడ రోడ్లు వేసుకోలేకపోయాం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో కొత్తగా రోడ్లు నిర్మించుకుంటున్నామని వెల్లడించారు. 2017లో గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు కొన్ని సమస్యలు చూశానని తాగునీరు, రోడ్లు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.