AP Deputy CM Pawan Kalyan Varahi Ammavari Deeksha Completed :సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో ముగిసింది. ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దీక్షాబద్ధలైన పవన్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఏక హారతి, ద్విహారతి, త్రిహారతి, చతుర్థ, పంచ, నక్షత్ర హారతులను అమ్మవారికి సమర్పించారు. అనంతరం కుంభ హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధనతో ముగించారు. అంతకుముందు దీక్షలో భాగంగా సూర్యారాధన కార్యక్రమాన్ని పవన్ నిర్వహించారు.
ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని పవన్ కల్యాణ్ ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య నమస్కార ప్రకరణం పూర్తి చేశారు. పవన్ కల్యాణ్‌కు వెన్ను సంబంధిత ఇబ్బందితో సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కాకపోవడం వల్ల మంత్రసహిత ఆరాధనను పండితులు నిర్వహించారు. పవన్ తర్వాత చాతుర్మాస దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గృహస్తాచార రీతిలో ఈ దీక్షను తలపెట్టనున్నారు. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభ తిధుల్లో దీక్షావస్త్రాలను ధరిస్తారు. దీక్షా సమయంలో పరిమిత సాత్వికాహారాన్ని స్వీకరిస్తారు.
పవన్ కల్యాణ్‌కు దైవ భక్తి ఎక్కువ. అందులో వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల్లో ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనానికి వారాహి అనే పేరు పెట్టుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించినందుకుగాను జూన్ 25 నుంచి వారాహి అమ్మవారి దీక్షను 11 రోజుల పాటు చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం ద్రవాహారమైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకున్నారు.