Deputy CM Pawan Kalyan Increased Funds to Panchayats:గ్రామాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధుల పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల పలువురు సర్పంచులు పంద్రాగస్టు, గణతంత్ర వేడుకలకు నిధుల కొరత ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి సమస్యను వివరించారు. దీన్ని పరిశీలించి పంచాయతీలకు నిధులు పెంచినట్లు చెప్పారు. మైనర్ పంచాయతీలకు గతంలో 100 రూపాయలు ఇచ్చేవారని దానిని 10 వేలకు పెంచామన్నారు. మేజర్ పంచాయతీలకు 250 రూపాయల నుంచి 25 వేలకు పెంచినట్లు చెప్పారు.
ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలకూ ఇదే విధంగా నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 15న పాఠశాలల్లో డిబేట్, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు క్రీడా పోటీలు పెట్టి బహుమతులు అందించాలని సూచించారు. పంద్రాగస్టున స్కూళ్లలో స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించాలని చెప్పారు. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచాలన్నారు. ఈ క్రమంలో నిర్వహణ కోసం ఇచ్చే మొత్తాన్నిపెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీల్లో వేడుకల వ్యయంపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్టు పేర్కోంటూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.