Hyderabad Metro Rail Second Phase: మెట్రో రైలు రెండోదశలో 5 కారిడార్లు రానున్నాయి. దీనికి సంబంధించి 2028 నాటికి ప్రయాణికుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించగా ఇందులో 54 స్టేషన్లు రానున్నాయి. అప్పటికి ఇవన్నీ పూర్తయితే ప్రతిరోజూ 7.96 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేసేందుకు అవకాశం ఉందని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో సంస్థ అంచనా వేస్తోంది.
కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు మెట్రో సంస్థ తెలిపింది. ఇప్పుడైతే ప్రయాణికుల అంచనాల సంఖ్యను తక్కువ చేసి చూపించామని వాస్తవంగా ప్రయాణికుల సంఖ్య 10 లక్షల దాకా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభమై బుధవారంతో ఏడేళ్లు పూర్తయింది. ఇప్పటివరకు మెట్రోలో 63.40 కోట్ల మంది ప్రయాణించారు.
ఆ రెండు మార్గాల్లోనే ప్రయాణికులు అత్యధికం : ప్రస్తుతం నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో పొడిగింపు ప్రతిపాదనలు 2వ దశలోనే ఉన్నాయి. ఇదే మార్గానికి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట దగ్గర పాత కారిడార్లను కలపనున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు కారిడార్‌లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 3.70 లక్షల వరకు ఉంటారని ఓ అంచనా. ఇక్కడే అత్యధికంగా ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తుంటారు. అలాగే మియాపూర్ నుంచి పటాన్చెరు మార్గంలో 1.65 లక్షల మంది ప్రయాణిస్తారనే అంచనాకు అధికారులు వచ్చారు. మిగతా కారిడార్లలో లక్షలోపే ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 2028కి ప్రాజెక్టు పూర్తవుతుందనే అంచనాతో మెట్రో ఈ లెక్కలు వేసుకుంది.
ప్రయాణించే ప్రయాణికుల అంచనా పట్టిక :
కారిడార్ | మార్గం | కి.మీ. | స్టేషన్లు | ప్రయాణికుల అంచనాలు(2028) |
4 | నాగోల్- విమానాశ్రయం | 36.8 | 24 | 3,70,000 |
5 | రాయదుర్గం - కోకాపేట | 11.6 | 8 | 92,000 |
6 | ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట | 7.5 | 6 | 72,000 |
7 | మియాపూర్ - పటాన్చెరు | 13.4 | 10 | 1,65,000 |
8 | ఎల్బీనగర్ - హయత్‌నగర్ | 7.1 | 6 | 97,000 |
తొమ్మిదో స్థానానికి పడిపోయే ప్రమాదం: ఈ నెల 26న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి గత పదేళ్లలో మెట్రో మార్గాల విస్తరణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో దిల్లీ, బెంగళూరు తర్వాత హైదరాబాద్ 3వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. వెంటనే విస్తరణ పనులు చేపట్టకపోతే హైదరాబాద్ 9వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని అన్నారు. బెంగళూరు, ముంబయి, చెన్నై నగరాల్లో రూ.50 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టాయని తెలిపారు. అలానే హైదరాబాద్‌లోనూ మెట్రో విస్తరణకు డిమాండ్ పెరిగిందని దీంతో 2వ దశ ప్రతిపాదనలు సీఎం రేవంత్‌కి వివరించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఏపీ పర్యాటకానికి కేంద్రం మెరుగులు - అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టు అభివృద్ధి
పోలవరం ఎత్తుపై రాజ్యసభలో చర్చ - ఆ విషయంలో తగ్గేదేలేదని వెల్లడి