ACB Searches Krishnadas EX PA : మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ మురళి నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ నేత కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పీఏగా మురళి పనిచేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
కోటబొమ్మాళి మండలం దంత గ్రామంతో పాటు, లింగంనాయుడిపేటలోని మురళి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు స్థిరాస్తి పత్రాలు, బంగారం, వెండి స్వాధీనం చేసుకొని ఆయణ్ని విచారిస్తున్నారు. మరోవైపు మురళి పనిచేస్తున్న బుడితి సీహెచ్‌సీలో పలు పత్రాలను పరిశీలించారు. విశాఖపట్నంలోని ఆటోనగర్‌లోనూ సోదాలు చేశారు. తనిఖీల అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ రమణమూర్తి పేర్కొన్నారు.