Drinkers Run After Seeing Drones In Anantapur : రాష్ట్రంలో డ్రోన్లు ఎక్కడ కనిపించిన మందుబాబులు పరుగులు తీస్తున్నారు. డ్రోన్ల కంటపడకుండా వాగులు, వంకలు, గట్లు, రైల్వే ట్రాక్‌లపై మత్తుదిగేదాక పరుగెత్తుతున్నారు. ఇంతకి డ్రోన్లు అంటే మందుబాబులకు ఎందుకు అంత భయం అనుకుంటున్నారా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గంజాయి, మత్తు పదార్థాలను నివారించేందుకు డ్రోన్లను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు సైతం డ్రోన్ల పర్యవేక్షణతో శివారు ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
మందు బాబులపై ప్రత్యేక నిఘా : తాజాగా బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మందు తాగుతున్న మందుబాబులపై అనంతపురం జిల్లా పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ పెట్టారు. నగర శివారు ప్రాంతాల్లో మందు తాగుతున్న మందు బాబులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గంజాయి, మద్యం మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు దిగే ఆకతాయిల ఆట కట్టించడమే లక్ష్యంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్న వారిని డ్రోన్ల సాయంతో గుర్తిస్తున్నారు.
వేడుక ఏదైనా డ్రోన్ ఉండాల్సిందే - వినువీధిలో వండర్ విజువల్స్
సీసాలు, గ్లాసులు వదిలేసి : అనంతపురం నగర శివారులోని కెనాల్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌కు సమీపంలో కొంత మంది కలిసి మందు తాగుతున్నారు. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్న పోలీసులకు ఈ బ్యాచ్ కనిపించింది. వెంటనే అటువైపుకు డ్రోన్‌ను వెళ్లనిచ్చారు. మందు కిక్‌లో ఉన్న మందుబాబులకు ఒక్కసారిగా డ్రోన్ శబ్దం వినపడటంతో సీసాలు, గ్లాసులు వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. చెట్లు, పుట్టలు లెక్కచేయకుండా పరుగెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.