Pawan Kalyan on YSRCP Opposition Status:ఈ ఐదేళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని వైఎస్సార్సీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయమైన చర్యని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదని, ప్రజలు ఇస్తే వచ్చేదని తేల్చిచెప్పారు.
ఒక్క సీటు పెరిగినా ప్రతిపక్ష హోదా వచ్చేది:జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకి వచ్చేదని గుర్తు చేశారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని వైఎస్సార్సీపీ గుర్తించాలని హితవు పలికారు. ఆరోగ్యం బాగా లేకున్నా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగించారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి చెప్పారని అన్నారు. అలాంటిది వైఎస్సార్సీపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవాలనుకోవటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు సభకు వస్తే, ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారని తెలిపారు.
జగన్ జర్మనీ వెళ్లటం మంచిది: ఉదయం గవర్నర్ని ఆహ్వాహించేందుకు స్పీకర్ రమ్మని తనని కోరినా, ప్రోటోకాల్ బ్రేక్ చేయటం సరికాదని తానే వెళ్లలేదని తెలిపారు. ఓట్లు శాతం ప్రకారం తనకు ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లటం మంచిదని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. మన దేశ నిబంధనల మేరకు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గతంలో ప్రజలను పాలిస్తే ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాదని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని నిలదీశారు.