Deputy CM Bhatti On Green Power Generation :2035 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన 4వ ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సమ్మేళనం, ఎగ్జిబిషన్ సందర్భంగా ఏర్పాటైన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు.
రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రెన్యూవబుల్ ఎనర్జీ పునాది లాంటిదని ఆయన పేర్కొన్నారు. భారతదేశం 500 గిగా వాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తెలంగాణ డైనమిక్ ఆర్థిక వ్యవస్థ, ఐటీ, ఫార్మసిటికల్స్ తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలతో ఈ పరివర్తనకు తెలంగాణ ప్రభుత్వం నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుందన భట్టి విక్రమార్క అన్నారు.
300 రోజులకు పైగా ఉండే సూర్యరశ్మితో సుమారుగా 26.4 గిగావాట్ల సామర్థ్యం : ఇది పెరుగుతున్న ఇంధన అవసరాలను సమతుల్యం చేయడం స్థిరత్వానికి ఒక నిబద్దతగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ఇంటెలిజెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ సుస్థిర సాంకేతికల చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమై ఉంది. కీలక పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేయడానికి ప్రాంతీయ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.
ఇవి గ్రీన్ పవర్ ఉత్పత్తికి అవకాశం కల్పిస్తాయని అన్నారు. తెలంగాణలో సమృద్ధిగా ఉన్న వనరులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, టీఎస్ - ఐపాస్ వంటి వ్యాపార అనుకూల సంస్థలు గ్రీన్ పవర్ రంగాల్లో కంపెనీలు అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి అన్నారు. 300 రోజులకు పైగా ఉండే సూర్యరశ్మితో సుమారుగా 26.4 గిగావాట్ల సామర్థ్యం అంచనా వేస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో బలంగా గాలులు వీచే మొదటి ఎనిమిది రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ ఉందన్నారు.