Deputy CM Bhatti on Congress Government : తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా పోతుందని, అందుకే బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి ఇద్దరిని అనుమతించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ట్వీట్ ఆమె వ్యక్తిగతమే అని తేల్చి చెప్పారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో ఉపముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని, పాఠశాల స్థాయిలో మంచి వాతావరణ తెస్తామన్నారు.
మూడో తరగతి వరకు అదే గ్రామంలో పాఠశాల ఉంటుందని, ప్రతి పది గ్రామాలకు ఒక రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటాయని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి మండలానికి మూడు సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలు, పదవ తరగతి వరకు పూర్తి ఉచిత విద్య ఉంటుందని వెల్లడించారు. ఆ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో రాత్రికి అక్కడ ఉండలేని పిల్లలను ఇళ్లకు పంపేందుకు సౌకర్యాలుంటాయని, వాహనాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల భూమి :ఒక్కో పాఠశాలకు 80 నుంచి 100 కోట్ల అంచనా వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటించారు. అదే విధంగా ఒక్కో పాఠశాలకు అందుబాటు ఆధారంగా 25 ఎకరాల భూమి వరకు ఉంటుందని వివరించారు. అయితే బాసర ఐఐఐటీలో మాదక ద్రవ్యాలు దొరకడం దురదృష్టకరమన్న ఆయన, దీనిపైనా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.