Deputy CM Bhatti Vikramarka Attend Bankers Committee Meeting : వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణ పరిమితిని సాధించడం సంతోషకరమని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ బ్యాంకర్ల సమావేశంలో రూ.2 లక్షల రుణమాఫీ అంశంపై కీలక చర్చ జరిగింది. 2024-25 వార్షిక రుణ ప్రణాళిక డిప్యూటీ సీఎం, మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయానికి 6,33,777.48 కోట్ల రూపాయలు, వ్యవసాయ పంట రుణాలు రూ.5,197.31 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 19,239.87 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని ఎస్‌ఎల్‌బీసీలో ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నాబార్డ్ సీజీఎం చింతల సుశీల గోవిందరాజులు పాల్గొన్నారు.
"దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్, హార్డ్వేర్ పార్కులు, హౌసింగ్ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ఓఆర్ అనుబంధంగా ప్రాంతీయ రహదారులు ఏర్పాటు చేసి అన్ని జిల్లాలకు లింక్ కలుపుతాం. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు మా ప్రధమ ప్రాధాన్యత."- భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
Bhatti Vikramarka Suggested to Bankers For Loan : రైతు భరోసా పథకం, సన్న ధాన్యం క్వింటాల్‌పై బోనస్, 24x7 విద్యుత్ సరఫరా చేస్తున్న క్రమంలో రాబోయే ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు డిమాండ్ రాబోతుందని అన్నారు. ఇథనాల్ తయారీలో పెద్ద ఎత్తున మొక్కజొన్న అవసరమని చెప్పారు. ఇక నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని భట్టి సూచించారు.