Deputy CM Bhatti On Illegal Construction In Telangana: లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు, ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాదులోనూ ఏర్పడతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గతంలో ఫ్యూడల్ మనస్తత్వంతో బందీ చేయబడిన రాష్ట్రాన్ని తాము పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని, భవిష్యత్తులోనూ ఈ విధానం కొనసాగుతుందని తెలిపారు.
నదీ గర్భంలో ఇళ్ల నిర్మాణాలు : ఎవరు ఏ భావజాలాన్నయినా వ్యక్తపరిచే వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పరిచామని పేర్కొన్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి మేధస్సు అంతా తెలంగాణ రాష్ట్రంతో పాటు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఉపయోగపడాలని, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని వారిని కోరారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్‌లు అని, ఇళ్ల నిర్మాణం పేరిట అన్నీ కనుమరుగైపోతున్నాయన్నారు. నదీ గర్భంలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని, వీటిని ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందన్నారు. హైదరాబాద్ ప్రాణాంతకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం : పేద వాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని భట్టి ఆరోపించారు. ధన, మాన, ప్రాణాలు, ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, అందులో భాగంగా చెరువులను రక్షించి, భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వందల చెరువులు కనపడకుండా పోయాయని, కనీసం చెరువు గర్భంలో కట్టుకోకుండా అయినా ఆపాలి అనేది తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. మూసీ నదిలో మంచి నీరు పారించడం, పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు.