Deputy CM Bhatti Meeting on Annual Budget Today :పూర్తిస్థాయి బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది. ఓటాన్ అకౌంట్ గడువు జులై నెలాఖరుతో పూర్తికానుంది. ఆలోగా పూర్తిస్థాయి బడ్జెట్‌కు సర్కారు ఆమోదం పొందాల్సి ఉంది. శాఖల వారీగా త్వరలోనే బడ్జెట్ కసరత్తును ఆర్థికశాఖ చేపట్టనుంది. ఆదాయార్జిత శాఖలతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు సమావేశం కానున్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌కు ఆమోదం పొందింది. ఓటాన్ అకౌంట్ గడువు జూలై నెలాఖరు వరకు ఉంది. ఆ లోగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఉభయసభల ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఆర్థికశాఖ త్వరలో కసరత్తు ప్రారంభించనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పన సమయంలోనే సర్కారు విస్తృత కసరత్తు చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఉజ్జాయింపుగా నిధులను కేటాయించారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్లో గ్యారంటీలకు నిర్ధిష్ట మొత్తాన్ని కేటాయించనున్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నిధులను పొందుపరచనున్నారు. వీటన్నింటిక సంబంధించి శాఖల వారీగా ఆర్థికశాఖ త్వరలో కసరత్తు ప్రారంభించనుంది.