Deputy CM Bhatti And Ministers Inspect Yadadri Power Plant: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (వైటీపీఎస్) అభివృద్ధి, పనుల పురోగతిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం యూనిట్ -2 ఆయిల్ సింక్రనైజేషన్‌ను స్విచ్ ఆన్ చేసి పనులను ప్రారంభించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు, సిబ్బంది, కార్మికులకు ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిపై టీజీజెన్‌కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష: ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 3 యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. 2025 మార్చి నాటికి 5 యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తియే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పనులు వేగవంతం చేయడానికి సివిల్ పనులతో పాటు, రైల్వే పనులు, రోడ్డు రవాణా మార్గాన్ని సులభతరం చేస్తున్నామన్నారు.
ప్రాజెక్టులో నిరుద్యోగులకు ఉద్యోగాలు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్జీటీ క్లియరెన్స్‌తో పాటు, నిరంతరం ప్రాజెక్టు పనులపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. భూ నిర్వాసితులకు భూసేకరణ నిధులతో పాటు, ప్రాజెక్టులో తప్పనిసరిగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌తో పాటు పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.