Singareni Coal Mines : వందేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ బొగ్గు నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ ఏడాది నుంచే సింగరేణి బొగ్గు గనుల మూసివేత కొనసాగుతుంది. రాబోయే 17 ఏళ్లలో సింగరేణి భూగర్బ గనుల సంఖ్య 19కు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలో సంస్థ భవిష్యత్ ప్రణాళికలేంటి? కొత్త బ్లాకుల ఏర్పాటుకు యాజమాన్యం ఏం చేయబోతుంది? బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర రంగాలకు సింగరేణిని విస్తరించాలనే ఆలోచన చేస్తుందా? తదితర అంశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం
ఉమ్మడి నాలుగు జిల్లాల్లో : బొగ్గు ఉత్పత్తిలో మేటిగా ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు నిక్షేపాలు తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో బొగ్గు గనులు దొరకడమే కష్టంగా మారిపోనుంది. నిల్వలు నిండుకున్న గనులను మూసివేయాలని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి సంస్థ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉంది. సంస్థకు 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 42 మైనింగ్ లీజులు ఉన్నాయి.
"అదనంగా మరో 35 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి సింగరేణి సంస్థ సమాయత్తం అవుతోంది. బొగ్గు నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెలికితీయాలని కసరత్తులు చేస్తున్నాం. నైనీ కోల్ బ్లాక్ నుంచి ఏడాదికి 10మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం" -బలరామ్, సింగరేణి సీఎండీ
మూతపడనున్న 4 అండర్ గ్రౌండ్ గనులు : 2 వేల 997 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసే అవకాశం ఉండగా ఇప్పటికే 1,565 మిలియన్ టన్నుల బొగ్గును సింగరేణి వెలికితీసింది. ఇంకా 1,432 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి ఇరవయ్యేళ్లు పడుతుందని యాజమాన్యం అంచనా వేస్తోంది. కొత్త బొగ్గు బ్లాకులను అన్వేషించి ఉత్పత్తి పెంచాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. సింగరేణి సంస్థ మైనింగ్ చేసే 42 బొగ్గు బ్లాకుల్లో 22 భూగర్భ గనులు, 20 ఓపెన్‌కాస్టులు ఉన్నాయి. ఈ ఏడాదిలో నాలుగు భూగర్భ, ఒక ఉపరితల గనులు మూతపడనున్నాయి.