YS Venkata Reddy Lease Issue :వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు వరుసకు సోదరుడు, పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుక ఇచ్చింది రాష్ట్ర గనుల శాఖ. వైఎస్సార్ జిల్లాలో దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువైన ముగ్గురాయి నిల్వలున్న లీజును ఇతనికి కట్టబెట్టింది. సెలవు రోజుల్లో, ఈనెల 15న కనుమ పండుగ నాడు లీజు కేటాయిస్తూ గనులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ దస్త్రం ఆఘమేఘాలపై కదలడం వెనుక వైఎస్సార్ జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. వేములలో సర్వే నంబర్లు 1021/26, 43ల్లో 11.6 హెక్టార్లలో ముగ్గురాయి ఖనిజ లీజుకు వెంకటరెడ్డి 2016లో అర్జీ చేసుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ దస్త్రం వేగంగా కదిలింది. 9.55 హెక్టార్లలో ముగ్గురాయి లీజుకు గనులశాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు 2020 మార్చిలో ప్రతిపాదన పంపారు.
Mines Venkata Reddy Irregularities :గనులశాఖ అప్పటి సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఈ లీజు ఫైల్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తాజాగా వైఎస్ వెంకటరెడ్డికి 9.55 హెక్టార్లలో 20 సంవత్సరాల కాల వ్యవధితో లీజు మంజూరుచేస్తూ ఈనెల 15న డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడి ఖనిజానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ లీజులో ఏటా 1390 టన్నుల చొప్పున ముగ్గురాయిని వెలికి తీయనున్నారు. దీని ప్రస్తుత మార్కెట్ విలువ టన్ను రూ.30,000ల నుంచి రూ.35,000ల వరకు ఉంది.