Medigadda Barrage Issue updates : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ ఆనకట్టకు జరిగిన నష్టంపై పూర్తిస్థాయి అంచనాకు రావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. వానాకాలంలో వచ్చే వరద పూర్తిగా దిగువకు వెళ్లిపోయేలా గేట్లన్నీ ఎత్తినా, ఆనకట్టకు చేపట్టిన తాత్కాలిక మరమ్మతులను ప్రాణహిత నుంచి ప్రవాహాలు మొదలయ్యేలోగా పూర్తి చేయడం కష్టం కానుంది.
వర్షాకాలం నాటికి కాని పనులు : నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక సిఫార్సుల ప్రకారం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఇన్వెస్టిగేషన్లు చేయడానికి నాలుగైదు నెలల సమయం పట్టనుంది. క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఎన్‌డీఎస్‌ఏ పూర్తి స్థాయి నివేదిక ఇస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే వచ్చే వర్షాకాలంలో మేడిగడ్డ వినియోగంలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
CWPRS Experts on Medigadda :మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఆనకట్టలను పరిశీలించి సంబంధిత ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలతో చర్చించిన ఎన్‌డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. సీఎస్‌ఎంఆర్ఎస్, ఎన్‌జీఆర్ఐ, సీడబ్ల్యూపీఆర్ఎస్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలతో వివిధ పరీక్షలు చేయించాలని సిఫార్సు చేసింది. అందులో భాగంగా మే 22, 23 తేదీల్లో పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చి స్టేషన్‌కు చెందిన ముగ్గురు నిపుణుల బృందం మూడు ఆనకట్టలను పరిశీలించి, ఏయే పరీక్షలు చేయాలో నిర్ణయించింది.
ఈ మేరకు 2 రోజుల క్రితం ఈఎన్సీ జనరల్ అనిల్‌కుమార్‌కు సీడబ్ల్యూపీఆర్ఎస్ లేఖ రాసింది. ఈ సంస్థ మూడు ఆనకట్టల్లో చేయాల్సిన పరీక్షలకు సుమారు రూ.4 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపింది. మేడిగడ్డలో రివర్ క్రాస్ సెక్షన్లలో బాత్‌మెట్రీ సర్వేకు రెండు నెలలు, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్లకు బోర్‌హోల్స్ వేసిన తర్వాత డేటా తీసుకోవడానికి నెల రోజులు, ఆ డేటాను విశ్లేషించి నివేదిక తయారు చేయడానికి రెండు నెలలు కలిపి మొత్తం మూడు నెలల సమయం పడుతుందందని సీడబ్ల్యూపీఆర్ఎస్ పేర్కొంది.