Returnable Plots Issue in Amaravati:ఆ రైతులంతా అమరావతి నిర్మాణానికి భూములిచ్చారు. ఒప్పందం ప్రకారం వారికి ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చింది. కానీ కష్ట సమయంలో ఆ ప్లాట్లు ఏ విధంగా ఉపయోగపడడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిపై బ్యాంకులు రుణమిచ్చేందుకు అంగీకరించడం లేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఆ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
రాజధాని రైతులకు దక్కని రుణాలు: అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఒప్పందం మేరకు సీఆర్డీఏ అధికారులు రిటర్నబుల్ ప్లాట్లను ఇచ్చారు. గత టీడీపీ హయాంలో ఈ ప్లాట్లపై రైతులకు బ్యాంకులు రుణాలిచ్చేవి. అయితే 2019లో మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్లాట్లపై రుణం ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. దీంతో కష్టాల్లో అక్కరకు వస్తాయనుకున్న రిటర్నబుల్ ప్లాట్లు కాగితాలకే పరిమితమవ్వడం చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్లాట్ల రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించింది. కానీ బ్యాంకు రుణాల విషయంలో మాత్రం ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇక జెట్ స్పీడ్లో అమరావతి పనులు - రాజధానిలో మరో రూ.24,276 కోట్ల పనులకు ఆమోదం
రుణాలివ్వడంలో జాప్యం:రాజధానికి భూములిచ్చినవారిలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే. రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రాకపోవడంతో వారికిచ్చిన ప్లాట్లు పనికి రావడం లేదు. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, వైద్యం వంటి అవసరాలకు డబ్బులు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైఎస్సార్సీపీ సర్కారు నిర్లక్ష్యం వల్ల రైతుల ప్లాట్లు ఉన్న ప్రాంతం గతంలో చిట్టడివిలా తయారయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జంగిల్ క్లియరెన్స్ పనులు జరిగాయి. అందువల్ల ఆ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టింది. ఇలాంటి తరుణంలో సైతం నిబంధనల పేరుతో బ్యాంకర్లు ప్లాట్లకు రుణాలు ఇవ్వకపోవడాన్ని రైతులు ఆక్షేపిస్తున్నారు.