Degree New Syllabus in Telangana :రాష్ట్రంలో ఏటా ఇంజినీరింగ్‌లో దాదాపు లక్ష మంది ప్రవేశాలు పొందుతుండగా బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఎం, బీబీఏ, బీసీఏల్లో 2 లక్షల మంది చదువుతున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ, రెసిడెన్షియల్, ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 1,100 వరకు ఉన్నాయి. వాటిలో 80 ప్రభుత్వ, మరో 20 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉన్నాయి. ఆ కళాశాలలకు 20-30 శాతం సిలబస్ మార్చుకునే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్నత విద్యామండలి నిర్ణయించిందే సిలబస్‌గా ఉంది.
ప్రస్తుతం నైపుణ్యం ఉన్న విద్యార్థులకే ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న పాఠ్య ప్రణాళికను సమీక్షించి నేటి అవసరాలకు తగ్గట్లు మార్చాలని విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగావకాశాలు దక్కేలా నైపుణ్యాలను పెంచడం, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయడం, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం వంటి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. వీలైనంత వరకు సాంకేతికతను మిళితం చేయాలని యోచిస్తున్నారు.
ఇప్పటివరకు సప్లిమెంటరీ సబ్జెక్టులుగా ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాటిని ప్రధాన సిలబస్‌లోకి తీసుకురావాలని కామర్స్ సహాయ ఆచార్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. తరగతి గది బోధనకు ప్రాధాన్యం తగ్గించి ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు. ఉన్నత విద్యామండలి మాత్రం త్వరలో సబ్జెక్టులు వారీగా నిపుణుల కమిటీలను నియమించి సమీక్షించాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం(2025-26) కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. విద్యామండలి నిర్ణయించిన సిలబస్‌తో తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను ముద్రిస్తుంది.