తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్లాక్​ బోర్డ్​పై రాసినవి కనబడటం లేదట - అంతా సెల్​ఫోన్​, టీవీల ఏఫెక్ట్!​ - EYE TEST IN GOVT SCHOOLS TELANGANA

విద్యార్థుల్లో తగ్గుతున్న దూరపు చూపు - సెల్‌ఫోన్లు, టీవీలు చూడడం వల్ల సమస్య అధికం - పట్టణ ప్రాంత పిల్లల్లో ఎక్కువ మంది బాధితులు

TG GOVT SHCOOLS IN TG
విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహిస్తున్న వైద్యులు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2024, 3:52 PM IST

Foresight in School Students : దూర దృష్టి ఉన్న వాళ్లు జీవితంలో త్వరగా ఎదుగుతారని పెద్దలు అనేక సందర్భాల్లో చెబుతుంటారు. ఇక్కడ దూరదృష్టి అంటే భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకునే ప్రణాళిక. కానీ ప్రభుత్వ పాఠశాలల్లోని అనేక మంది వేల సంఖ్యలో విద్యార్థులు దూరదృష్టి లోపాన్ని ఎదుర్కొంటున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్రీయ బాల్‌ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా కొనసాగుతున్న కంటి పరీక్షల కార్యక్రమంలో విద్యార్థుల్లో దూరం చూపు (డిస్టెన్స్‌ విజన్‌) తగ్గుతున్నట్టు తేట తెల్లమైంది.

ఇందుకు ప్రధాన కారణం పిల్లలు ఎక్కువ సేపు సెల్‌ఫోన్లను వినియోగించడం, గంటల తరబడి టీవీలకు అతుక్కుపోవడమేనని వైద్యులు గుర్తించారు. ఆర్‌బీఎస్‌కే ఆధ్యర్యంలో 300 బృందాలతో పిల్లల్లో కంటి పరీక్షలు చేసే కార్యక్రమాన్ని సర్కారు చేపట్టింది. ఇప్పటికే అన్ని గురుకులాల్లో 3 లక్షల 48 వేల 809 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో దూరపు దృష్టి లోపంతో బాధపడుతున్న వారు 23 వేల 697 మంది అని గుర్తించారు.

ఆరు మీటర్లు తర్వాతి దూరంలో ఉన్న వస్తువులను సరిగా చెప్పలేకపోతే దూరం చూపు మందగించినట్లు వైద్యులు నిర్ధారిస్తున్నారు. ఈ సమస్య బారిన గురుకుల పాఠశాల విద్యార్థులు 6 శాతానికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఇతర కంటి సమస్యలు ఉంటే దగ్గరలోని ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు పంపిస్తూ చికిత్స అందిస్తున్నారు.

సర్కారు పాఠశాలల్లో కూడా :సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు కూడా కంటి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 9 లక్షల 72 వేల 979 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 41వేల 574 మంది దూరదృష్టి లోపంతో బాధపడుతున్నట్లు నిర్థారించారు. 4.3 శాతం పిల్లల్లో సమస్యను గుర్తించారు. మొత్తంగా వందలో నలుగురైదుగురికి కంటి చూపు సమస్య ఉన్నట్టు తేలగా, అర్బన్​ ప్రాంతాల్లోని పిల్లల సంఖ్య అధికంగా ఉంటోంది.

హైదరాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, వరంగల్, కరీంనగర్‌ తదితర నగర ప్రాంతాల్లోని సర్కారు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించగా సుమారుగా 10 శాతం వరకు పిల్లలకు దూరదృష్టి సమస్య ఉన్నట్లు తేలడం అందరికీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు అధికంగా టీవీ, సెల్‌ఫోన్‌లు ఎక్కువగా చూడడం వల్ల వారిలో కంటి చూపు సమస్య అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇక మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు కంటి సమస్యలు రావడానికి కారణం పోషకాహార (మాల్​న్యూట్రిషన్​) లోపమేనని స్పష్టమైంది. పిల్లలకు కంటి పరీక్ష చేసే కార్యక్రమం ప్రస్తుతానికి 70 శాతం పూర్తయింది. మరో నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తయ్యే అవకాశముంది.

కంటి చూపు సమస్యతో బాధపడుతున్న పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించాక కౌన్సెలింగ్​ ఇస్తున్నాం. పాలు, గుడ్లు, విటమిన్​ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినాలి. టీవీలు, సెల్​ఫోన్లు చూడటం తగ్గించి డిజిటల్ తెరలకు దూరంగా ఉండాలని చెప్తున్నాం. సమస్య ఉన్న పిల్లలకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది - ఆర్​.వి.కర్ణన్​, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్

మీ పిల్లలు సెల్​ఫోన్​కు బానిసలుగా మారుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే జన్మలో మొబైల్ పట్టుకోరు

హెచ్చరిక : మహిళల గర్భాశయంపై మొబైల్​ ఎఫెక్ట్ - ఏం జరుగుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details