తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంత వైద్యం చేసుకుంటున్నారా? - ఐతే మీరు డేంజర్​లో ఉన్నట్టే!! ఎందుకో తెలుసా? - SELF MEDICATION IS HARMFUL

Self Medication Is Harmful : రోజులు మారాయంటూ ఇంటర్నెట్​తోపాటు సామాజిక మాధ్యమాల్లోనే మనకు కావాల్సిన మెడిసిన్​ ప్రిస్క్రిప్షన్ దొరుకుతుందంటూ చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. దీని వల్ల ప్రమాదకర ధోరణి పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తరచూ యాంటీబయాటిక్స్, దగ్గు, జలుబు, నొప్పి నివారణ మాత్రలు తీసుకోవడంతో ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి. తాజాగా దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశాయి.

Self Medical Treatment
Self Medication (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 1:44 PM IST

Self Medical Treatment With Out Doctor Consent :అర్హులైన డాక్టర్​ను సంప్రదించి, సరైన రీతిలో ఔషధాలను వాడడమే అన్ని విధాలా మంచిది. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలామంది కొత్తగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. సాధారణ జలుబు, దగ్గు మొదలుకొని గొంతునొప్పి, జ్వరం, ఒళ్లు, మోకాళ్ల నొప్పులు, తలనొప్పి తదితరాలకు సొంతంగా ఔషధాలను వినియోగించే ప్రమాదకర ధోరణి ఇటీవల కాలంలో పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాల కారణంగా ఆరోగ్యంపై కొంత అవగాహన పెరగడం, ఇంటర్నెట్‌లో అన్ని జబ్బులకూ ఔషధాల సమాచారం లభ్యమవడం, గతంలో ఇదే జబ్బుకు వైద్యుడు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ స్లిప్​ అందుబాటులో ఉండడం, ప్రైవేటులో వైద్యుడి సంప్రదింపులు మరీ ఖరీదు కావడం, ఇలా కారణాలేమైనా సొంతంగా మందుల్ని కొనుక్కోవడం మాత్రం ఎక్కువైంది.

ఔషధ దుకాణాలు కూడా నిబంధనలు బేఖాతరు చేస్తూ వైద్యుడి లేకుండానే యథేచ్ఛగా మందులిచ్చేస్తున్నాయి. ఫలితంగా దీర్ఘకాలంలో రోగుల ప్రాణాల మీదకొస్తోంది. ఇలా సొంతంగా మందుల వాడకం వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని, మొత్తంగా ప్రజారోగ్యమే ప్రమాదంలో పడే అవకాశాలెక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. వైద్యుడి సలహాలు, సూచనలు లేకుండా ఎవరికి వారే మందులు వాడితే కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొంటూ డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అతుల్‌ గోయల్‌ తాజాగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు.

మత్తుగా దగ్గు మందు : అన్ని రకాల మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఈ అంశంపై చైతన్యం కలిగించాలని, ఇప్పటికే ఈ తరహాలో మందులు వాడుతున్న వారు, ఈ ధోరణి నుంచి బయటపడాలనుకుంటే వైద్యారోగ్య శాఖ తరఫున వారికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఈ లేఖలో పలు అంశాలను వివరంగా ప్రస్తావించారు. కొన్ని రకాల దగ్గు మందు ద్రావణాలను మత్తు కోసం కూడా కొందరు వినియోగిస్తున్నారు. వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడని దగ్గు మందును, కొన్ని మందుల దుకాణాలు​ ఇష్టానుసారంగా విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకొని వీటి అమ్మకాలను జోరుగా కొనసాగిస్తున్నాయి. అడపాదడపా చేసే తనిఖీలే తప్ప పటిష్ఠ నిఘా లేకపోవడంతో ఔషధ దుకాణాలకు వరంగా మారింది.

సొంతంగా మందులు వాడితే - ఔషధ దుష్ఫలితాలు : లక్షణాలు కనిపించగానే సొంతంగా మందులు వాడితే, సమస్య తాత్కాలికంగా తగ్గినట్లు అనిపించినా కొన్నిసార్లు అసలైన వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమై జబ్బు ముదురుతుంది. సరైన చికిత్స అందక వ్యాధి ముదిరి ప్రాణాంతక పరిస్థితులు రావొచ్చు. ప్రతి ఔషధానికి ఒక లక్ష్యమంటూ ఉంటుంది. ఏ జబ్బు కోసం ఎంత డోసులో వాడాలనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా వయసు, బరువు, లక్షణాల తీవ్రత ఆధారంగా మోతాదుల్లో మార్పులు ఉంటాయి. అందుకే ఔషధాల డోసు తగ్గినా పెరిగినా దుష్ఫలితాలు తలెత్తుతాయి. డ్రగ్‌ రియాక్షన్‌ అయితే, జీవన్మరణ సమస్యలూ తలెత్తుతాయి.

మందుల సమ్మిళితం :వైద్యుడి సలహా లేకుండా వేర్వేరు రకాల ఔషధాలను ఒకేసారి వేసుకునే సందర్భాల్లో కొన్నిసార్లు ప్రతికూలత ఎదురవుతుంది. ఎందుకంటే ఒకరికి పని చేసిన ఔషధం అందరికీ పనిచేస్తుందని చెప్పలేం. వ్యక్తులు, జబ్బులకు కారణాల అనుగుణంగా ఔషధాలు మారుతుంటాయి. వీటిని గ్రహించకుండా వినియోగిస్తే ప్రమాదమే. అలాంటప్పుడు ఆసుపత్రిలో చేరాల్సి రావచ్చు.

యాంటీ బయాటిక్స్‌ నిరోధకత : అవసరం లేకపోయినా యాంటీ బయాటిక్స్‌ను తరచూ వినియోగిస్తే శరీరంలో వాటికి నిరోధకత పెరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్ల బారినపడితే, అప్పుడు యాంటీ బయాటిక్స్‌ వేసుకున్నా పని చేయవు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత పెరిగి అనారోగ్యానికి పాలై, అవయవాల పనితీరును కూడా దెబ్బతీస్తుంది.

ఉదాహరణకు జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌కు యాంటీ బయాటిక్స్‌ను తరచూ వినియోగించడం, పూర్తిస్థాయి కోర్సు వాడకుండా లక్షణాలు తగ్గగానే మానేయడం వంటి చర్యలతో భవిష్యత్‌లో ఆ యాంటీ బయాటిక్స్‌ పనిచేయవు. నొప్పినివారణ మాత్రలను తరచూ వాడితే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. జీర్ణకోశంలో అల్సర్లు ఏర్పడి రక్తస్రావం జరుగుతుంది.

వాడక తప్పని బలహీనత : నొప్పి నివారణ, నిద్ర లేమి, అలర్జీలు వంటి నివారణ మందులను దీర్ఘకాలం వాడితే కొత్త అనర్థాలు ఏర్పడుతాయి. వాటిని వాడకపోతే రోజు గడవని బలహీనతను ఎదుర్కోవాల్సి వస్తుంది. మందు వాడితేనే నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. టాబ్లెట్​ వేసుకుంటేనే నిద్ర వస్తుంది. లేకపోతే నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సి వస్తుంది. ఇలాంటి దుస్థితి వల్ల ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

మీరు కొన్న మందులు మంచివా నకిలీవా? - తెలంగాణలో ఏం జరుగుతోంది? - గందరగోళంలో ప్రజలు - Fake Medicine in Telangana

Self Medication: సొంత వైద్యం- ప్రమాదంలో ప్రాణం!

ABOUT THE AUTHOR

...view details