తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద తెచ్చిన కష్టాలు - రిపేర్​కు క్యూ కడుతున్న వాహనాలు - జేబులు తడుముకుంటున్న యజమానులు! - Cars damaged due to heavy flood - CARS DAMAGED DUE TO HEAVY FLOOD

Cars Damged in Vijayawada : వరద బీభత్సం నుంచి కాస్త తేరుకున్న విజయవాడ ఇప్పుడు కార్ల సమస్యతో సతమతం అవుతుంది. ఎక్కడ చూసిన తిప్పలుకుప్పలుగా కార్లు షోరూం, మెకానిక్​ షెడ్​లలో ఉన్నాయి. ఈ కార్లను మరమ్మతు చేయడానికి లక్షల్లో ఖర్చు అవుతుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

Cars Damged in Vijayawada
Cars Damged in Vijayawada (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 9:34 AM IST

Flood Damaged Cars in Vijayawada of AP :ఏపీలోనివిజయవాడలో వరద బీభత్సానికి కార్లు పెద్ద సంఖ్యలో దెబ్బతిన్నాయి. కృష్ణమ్మ మహోగ్రరూపం, బుడమేరులో ఊహించని వరదకు ఇంటి సెల్లార్లోనే కాకుండా రోడ్డుపక్క పార్కు చేసిన కార్లు సైతం తలకిందులయ్యాయి. వరద తగ్గుముఖం పట్టడంతో దెబ్బతిన్న కార్లను షోరూమ్‌ల వద్దకు తీసుకొచ్చి సర్వీసింగ్‌ చేయించేందుకు యజమానులు నానాయాతన పడుతున్నారు. ఒక్కో కారుకు కనిష్ఠంగా రూ.70 వేలు నుంచి రూ.1 లక్షకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. రూ.12 లక్షల నుంచి రూ.1 కోటి వరకు కొనుగోలు చేసిన కార్లలో కొన్నింటికి కనీస రీసేల్​ ధర కూడా వచ్చేలా లేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.

వేలాదిగా దెబ్బ తిన్న కార్లు : విజయవాడలోని వరద ప్రభావ ప్రాంతాల్లో ఎటు చూసినా వాహనాలు రోడ్లపై చెల్లాచెదురయ్యాయి. నీటి ప్రవాహానికి పార్కింగ్‌ చేసిన వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. మరికొన్ని కాల్వల్లో బోర్లాపడ్డాయి. ఇంకొన్ని తలకిందులై నీటమునిగిపోయాయి. నీటి ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వాహనదారులు కార్లను షోరూమ్‌లకు పంపుతున్నారు. పాత, కొత్త అనే తేడా లేకుండా వేలాది కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

మరమ్మతులకు సైతం భారీగా ఖర్చు అవుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో టాటా, హుందాయ్ ఇతర కార్ల కంపెనీల గోడౌన్లు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఉన్న కార్ల షోరూమ్​లలో వరద నీరు చేరింది. సింగ్ నగర్, గొల్లపూడి, భవానీపురం ప్రాంతాల్లో వేల సంఖ్యలో కార్లు నీటిలో మునిగాయి. కార్ల నష్టాన్ని అంచనా వేయలేని రీతిలో ఉన్నాయి.

"సుమారు 40కుపైగా కార్లను రిపేరు చేశాం. మరో 4,5 రోజుల్లో వాహనాలు రిపేరుకు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువున్నాయి. కస్టమర్లకు పూర్తిగా సహకరించి ఇన్సూరెన్స్​ క్లైమ్​ చేస్తున్నాం. పూర్తిగా నీటమునిగిన కారుకి సుమారు రూ.1.50 లక్షలు నుంచి రూ.2 లక్షలు అవుతుంది. ఇన్సురెన్స్​ లేని వాహనాలకు ప్రభుత్వం కొంతమేర సహాయం చేస్తే తాము కూడా సహకరిస్తాం." -రామకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్, మిత్ర ఏజెన్సీస్‌, విజయవాడ

సర్వీసుకు వచ్చిన కార్లకు లక్షల్లో ఖర్చు : వరద ఉద్ధృతి తగ్గడంతో కాలనీల నుంచి వివిధ కంపెనీలకు చెందిన కార్లను ట్రక్​లపై, గొలుసులతో కట్టి ఏదో విధంగా సర్వీసు సెంటర్లకు తీసుకువస్తున్నారు. పలు ప్రాంతాలలో నీరు ఉన్నందున ఇంకా కొన్ని కార్లు వరదలోనే నానుతున్నాయి. సర్వీస్ కోసం వచ్చిన కార్లకు రూ. లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉందని, వరదల్లో తడిసిన కార్లను సర్వీస్ చేయిస్తే దూరప్రయాణాలతో ఇబ్బందులు తలెత్తవని సలహా ఇస్తున్నారు.

అలాగే కార్లకు జరిగిన నష్టాన్ని 3 విభాగాలుగా విభజించి, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు కూడా తమ వంతు కర్తవ్యంగా ఆర్థిక భారం కాకుండా చేస్తామని కంపెనీల మేనేజర్లు చెబుతున్నారు. కార్లకు మరమ్మతులు కోసం భారీగా ఖర్చు కావొస్తుండడంతో ఏదో ఓ ధరకు విక్రయించి కొత్త వాటిని చూసుకోవడమే మేలనే అభిప్రాయంతో కొందరు యజమానులున్నారు.

నీట మునిగిన పంటలు, నేలకొరిగిన తోటలు - చేతికందే పరిస్థితి లేదంటున్న అన్నదాతలు - Crop Loss In Telangana

పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు, రప్పలు - అతలాకుతలమైన రైతుల పరిస్థితి - Floods Damage in Telangana

ABOUT THE AUTHOR

...view details