Daggubati Purandeswari Comments : టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న దుష్ట శక్తిని గద్దె దించేందుకు ఈ పొత్తులు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. పొత్తుల వల్ల కొంతమంది ఆశావహులకు నిరాశ ఎదురైనా, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని భావించామని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుందన్న పురందేశ్వరి, భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. వైసీపీ నేతలు అంటున్న వైనాట్ 175 వెనక ఉన్న రహస్యం ఏంటో ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. దొంగ ఓట్ల ద్వారానే వైసీపీ నేతలు గెలవాలి అనుకుంటున్నారని ఆరోపించారు. సచివాలయాలు, ప్రభుత్వ భవనాలనూ తనఖా పెట్టేశారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు ప్రతి కార్యకర్త పోరాడాలి : పురందేశ్వరి
తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు: ప్రభుత్వ ఆస్తుల తనఖా పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నించారు. గనులను సైతం తనఖా పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజాధనంతో కట్టిన సచివాలయాన్ని తాకట్టు పెట్టే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే ఉందని, ఇష్టారీతిన దోపిడీలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తూ, మట్టిని, ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారని అన్నారు. మరోవైపు నాణ్యత లేని మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే అరెస్టు చేస్తున్నారు:రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గళం విప్పితే అరెస్టు చేస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు దారి మళ్లించారని పురందేశ్వరి ఆరోపించారు. ఎస్సీ యువకుడిని హత్యచేసిన ఎమ్మెల్సీతో కలిసి తిరుగుతున్నారని విమర్శించారు. ఎస్సీలకు జగన్ చేసిన న్యాయం ఇదేనా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఎవరికీ కూడా న్యాయం జరగడం లేదని, కేవలం మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుష్టశక్తిని గద్దె దించేందుకే పొత్తులు - కూటమితోనే రామరాజ్యం: పురందేశ్వరి రానున్న ఎన్నికల్లో కేవలం బీజేపీ అభ్యర్థులనే కాకుండా కూటమి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మూడు పార్టీల జెండాలు వేరైనా, అజెండా మాత్రం ఒక్కటే. కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం సాధ్యం. అంతా కలిసి పనిచేసి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలి. కూటమి గెలిస్తేనే రాష్ట్రంలో సుపరిపాలన వస్తుంది. -పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
వైసీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుంది: పురందేశ్వరి