మంచి నీళ్లివ్వడానికి ప్రాజెక్టు నిర్మాణం పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగం (ETV Bharat) D-Fluoride Project Issues in Warangal :వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు మంచినీటిని అందించాలని ఉద్దేశంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదనలతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులో భూసేకరణ చేపట్టిన అధికారులు, భూ నిర్వాసితులకు పరిహారం కూడా అందించారు. 2002లో రూ.38 కోట్ల వ్యయంతో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మంచినీటి జలాశయానికి శంకుస్థాపన చేశారు.
జలాశయం నిర్మాణం ద్వారా నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాలలోని 98 గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించాలని ఉద్దేశంతో ఈ నిర్మాణ పనులు చేపట్టారు. 448 మిలియన్ క్యూ.మీ సామర్థ్యం గల జలాశయంలో వర్షం నీటితో పాటు ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీరు అందించేలా తీర్చిదిద్దారు. దుగ్గొండి మండలం మాందాపురం గ్రామం నుంచి సుమారు 17 కిలోమీటర్ల నిడివితో ఎస్సారెస్పీ 11 ఆర్ కాలువలు ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేశారు. దీనికి సంబంధించి జంగాలపల్లి తండా, దుగ్గొండి మండలం గిర్నిబావి, నల్లబెల్లి మండలం మేడపల్లి వద్ద నీటిని శుద్ధి చేసేందుకు భారీ ఎత్తున సంపులు ఏర్పాటు చేశారు.
గ్రామాలకు నీరు అందించేందుకు ప్రాజెక్టు ప్రాంగణంలోని మొత్తం 156.70 కిలో మీటర్ల పైపు లైన్లను నిర్మాణం చేశారు. ఆ పైపులైన్ల ద్వారా కొంతకాలం నర్సంపేట పట్టణంతో పాటు మిగతా 98 గ్రామాలకు మంచినీటిని అందించారు. ఏమైందో తెలియదు కానీ గత 12 సంవత్సరాలుగా జలాశయం నీటిని వినియోగించకుండా నర్సంపేట ప్రజలకు మిషన్ భగీరథతో పాటు పాకాల సరస్సు నీటిపై ఆధారపడ్డారు. ఈ కారణంగా మంచినీటి జలాశయం పూర్తిగా మరుగున పడిపోయింది.
'గుత్తేదారు స్పందించకపోతే - అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు' - Judicial Inquiry On Kaleshwaram
రెండు మూడు రోజులకోసారి నీరు : ప్రస్తుతం ఎండ తీవ్రతతో మిషన్ భగీరథ పైపులు తరచుగా లీకేజీ కావడంతో పాటు రెండు, మూడు రోజులకోసారి నల్లాలు వస్తున్నాయి. దీంతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన జలాశయం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. పంప్ హౌస్ కోసం నిర్మించిన భవనాలు తుప్పు పట్టి శిథిలమయ్యాయి. నీటిని శుద్ధి చేసేందుకు ఉపయోగించే కోట్ల రూపాయల విలువైన మోటార్లు, విద్యుత్ పరికరాలు అక్కరకు రాకుండా పూర్తిగా పాడైపోయాయి.
కోట్ల రూపాయలతో కట్టి నిరూపయోగం :జలాశయం కట్టపై పిచ్చి చెట్లు పెరిగడంతో కట్టకు ప్రమాదం పొంచి ఉందని సమీప గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలతో మంచినీటి జలాశయం నిర్మించారని ఈ ప్రాజెక్టు నింపేందుకు ఎస్సారెస్పీ 11 ఆర్ కెనాల్‌ను కూడా నిర్మించారని అక్కడి ప్రజలు తెలిపారు. ఆ కెనాల్ ద్వారా జలాశయంలోకి ఒక్కరోజు కూడా నీరు వచ్చిన పాపాన పోలేదని గ్రామస్థులు అంటున్నారు. ప్రతి ఏటా వర్షపు నీటితో జలాశయంలోకి నీరు వచ్చేవని ఆ నీటిని కొంతకాలం నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల ప్రజలకు నీరందించే వారని చెప్పారు. కొన్ని రోజులకు అధికారులు, ప్రజా ప్రతినిధుస నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయిందన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు పైన దృష్టి సారించి మరమ్మతులు చేయించి నర్సంపేట పట్టణ ప్రాంత ప్రజలకు నీరు అందించాలని వేడుకుంటున్నారు.
సింగరేణి గనుల కోసం విలువైన భూములిచ్చి - ఏళ్లుగా సమస్యలతో సహజీవనం - దయనీయం ఇల్లందు నిర్వాసితుల దుస్థితి - Singareni Colony Public Problems
తెలంగాణలో అడుగంటుతున్న జలవనరులు - జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో తగ్గుతున్న నిల్వలు - Water Crisis In Telangana