తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక్క అక్షరం మార్చి - రూ.10 కోట్లు కాజేశారు - CYBER FRAUD WITH FAKE MAIL IDS

తస్మాత్‌ జాగ్రత్త - నకిలీ ఈ-మెయిల్​తో సైబర్‌ నేరగాళ్ల మోసాలు - 'ఓ' ను 'ఏ'గా మార్చి రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

CyberCriminals Embezzle 10 Crore Using Fake Email ID
CyberCriminals Embezzle 10 Crore Using Fake Email ID (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 2:53 PM IST

CyberCriminals Embezzle RS.10 Crore Using Fake Email ID :ఒక్క అక్షరాన్ని మార్చి ఈ-మెయిల్‌లో ఏమార్చి సైబర్‌ నేరగాళ్లు నగదు కొల్లగొడుతున్నారు. ఒకేలా క(అ)నిపించేలా భ్రమింపజేస్తూ నకిలీ మెయిల్‌ ఐడీలను సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మాయాజాలానికి మేధావులు సైతం బుట్టలో పడుతున్నారు. నష్టం జరిగిన తరువాత గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసినా అంతగా ఉపశమనం ఉండటం లేదు. ఈ మేరకు ఈ-మెయిల్‌ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

ఒక్క అక్షరం మార్చి, రూ.10 కోట్లు స్వాహా : హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ సంస్థను ఇటీవల సైబర్‌ నేరగాళ్లు ఇదే రీతిలో మోసగించారు. ఆ సంస్థ హాంకాంగ్‌ నుంచి ముడి సరుకు కొనుగోలు చేస్తుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ ఈ మెయిల్‌ ద్వారా జరిగేవి. హాంకాంగ్‌ సంస్థ తరఫున robert@gmail.com ద్వారా సంప్రదింపులు జరిపేవారు. ఇటీవల సరుకు సరఫరా పూర్తి అయిన తరువాత ఒకరోజు హైదరాబాద్‌ సంస్థకు ఓ మెయిల్‌ వచ్చింది. ఆడిట్‌ కారణాల వల్ల తమ బ్యాంకు అకౌంట్​ మార్చాల్సి వచ్చిందని, తమకు రావాల్సిన బకాయిలు ఫలానా అకౌంట్​కు బదిలీ చేయాలన్నది దాని సారాంశం. దాంతో హైదరాబాద్‌ సంస్థ ఆ అకౌంట్​కు డబ్బు బదిలీ చేసింది.

ఇది జరిగిన వారం తర్వాత తమకు ఇంకా డబ్బు రాలేదని హాంకాంగ్‌ సంస్థ సమాచారం అందించింది. దాంతో కంగారుపడ్డ హైదరాబాద్‌కు చెందిన సంస్థ తాము డబ్బు బదిలీ చేసిన అకౌంట్ వివరాలు పంపారు. అసలు ఆ ఖాతా తమది కాదని, డబ్బు పంపాలని చెప్పిన ఆ ఈ-మెయిల్‌ కూడా తాము పంపలేదని హాంకాంగ్‌ సంస్థ చెప్పింది. దీంతో హైదరాబాద్‌ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఇదంతా సైబర్‌ నేరగాళ్ల ఎత్తుగడగా తేల్చారు.

హాంకాంగ్‌ సంస్థ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన కేటుగాళ్లు ఆ సంస్థ జరుపుతున్న లావాదేవీల వివరాలు అన్నీ సేకరించారు. సరుకు రవాణా చేసిన తర్వాత తెలివిగా అదే సంస్థ నుంచి మెయిల్‌ పంపుతున్నట్లు ఫేక్ మెయిల్‌ ఐడీ ద్వారా బ్యాంకు అకౌంట్​ మార్చుతున్నట్లు మెయిల్‌ పంపారు. ఇందుకోసం robert@gmail.comకు బదులు rabert@gmail.com అనే మెయిల్‌ ఐడీ సృష్టించారు. రాబర్ట్‌ అనే పేరులో ‘ఓ’ బదులు ‘ఏ’ చేర్చారు. చూడటానికి రెండింటికీ పెద్దగా తేడా లేకపోవడంతో వారికి అనుమానం రాలేదు. ఇలా సైబర్​ కేటుగాళ్లు రూ.10 కోట్లు కొట్టేశారు. ఇదే తరహాలోనే హాంకాంగ్‌ సంస్థను నేరగాళ్లు భారీగా మోసగించినట్లు అధికారులు గుర్తించారు.

తస్మాత్‌ జాగ్రత్త :ఇటీవల ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. అందుకే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే సంస్థల మెయిల్‌ ఐడీలతో అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు, బ్యాంకు అకౌంట్ మార్చేటప్పుడు ఫోన్‌ చేసి నిర్ధారించుకున్న తర్వాతనే నగదు బదిలీ చేయాలని వారు సూచిస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇలాంటి మోసాలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

100 మందే 10వేల నేరాలు చేశారు - తెలంగాణ పోలీసులు ఎలా చెక్ పెడుతున్నారంటే!

మా కంపెనీలో పెట్టుబడులు పెడితే 40 శాతం షేర్లు - రూ.కోట్లలో మోసం చేసిన కేటుగాడు

ABOUT THE AUTHOR

...view details