Cyber Fraud In Telangana: రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్ మోసాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల అవసరాలు, సగటు కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, సాధారణ మహిళల భయాలను ఆసరాగా చేసుకొని దొరికినంత దోచుకుంటున్నారు. దీనిపై పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేసినా లాభం ఉండట్లేదు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ వేదికలను ఆసరాగా చేసుకొని అమాయకులను ఏమారుస్తున్నారు.
అంతర్జాలంలో నకిలీ వెబ్‌సైట్లు : తాజాగా అంతర్జాలంలో నకిలీ వెబ్‌సైట్లు, కష్టమర్ ఫోన్ నంబర్లను అసలైన సంస్థలకు దీటుగా సృష్టిస్తున్నారు. కష్టమర్లు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన వెంటనే దానికి సంబంధించిన వాటి నుంచి కాల్ చేసి మోసం చేస్తున్నారు. ఇలాంటివి రోజుకు చాలా కేసులు నమోదవుతున్నాయి.
రూ.5 వేలిస్తే నకిలీ వెబ్‌సైట్లు : ఎక్కువ మంది నకిలీ వెబ్‌సైట్, అసలు వెబ్‌సైట్ అనే తేడా గుర్తించలేకపోవడం ఒక సమస్య. రూ.5 వేలిస్తే బ్యాంకులు, ప్రముఖ సంస్థలను పోలిన నకిలీ వెబ్‌సైట్లను అచ్చుగుద్దినట్లు సృష్టిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2023- 24 వార్షిక నివేదికలో గూగూల్ సర్వీసుల్ని నేరగాళ్లు వాడుకుంటున్నట్లు ప్రస్తావించింది.