తెలంగాణ

telangana

ETV Bharat / state

'డిజిటల్ అరెస్ట్​'తో భయపెట్టి - వృద్ధ దంపతుల నుంచి రూ.10.61 కోట్లు స్వాహా - Elderly Couple Digital Arrest - ELDERLY COUPLE DIGITAL ARREST

Digital Arrest : ఆ వృద్ధ దంపతులు జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సంపదను సైబర్​ నేరగాళ్లు దోచేశారు. డిజిటల్​ అరెస్ట్ పేరిట బురిడీ కొట్టించి, పలు దఫాల్లో మొత్తం రూ.10 కోట్లకు పైగా కొట్టేశారు.

Elderly Couple Digital Arrest in Hyderabad
Elderly Couple Digital Arrest in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 9:30 AM IST

Cyber ​​Fraud in the Name of Digital Arrest: ఆ వృద్ధ దంపతులకు సంతానం లేదు. దీంతో వారు జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సంపాదనను బ్యాంకులో భద్రంగా దాచుకున్నారు. ఈ క్రమంలోనే ఆ సొమ్ముపై సైబర్​ నేరగాళ్ల కన్నుపడింది. వారిద్దరినీ వివిధ రకాలుగా భయపెట్టి డిజిటల్​ అరెస్ట్​ చేశామంటూ బెదిరించి ఏకంగా రూ.10.61 కోట్లను దోచేసుకున్నారు. మోసపోయామని గ్రహించిన వృద్ధులు సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్​కు చెందిన ఓ వృద్ధుడికి జులై 8న ఉదయం ఎస్​బీఐ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్​ వచ్చింది. 'మీ ఆధార్​ కార్డును ఉపయోగించి వెస్ట్​ ముంబయి బాంద్రాలో మే 9న వేరే వ్యక్తి బ్యాంకు ఖాతా తెరిచారు. ఆ వ్యక్తి డబ్బులు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు' అని చెప్పారు. దాంతో కంగారుపడిన వృద్ధుడు ముంబయిలో తనకు ఎలాంటి బ్యాంకు ఖాతా లేదని చెప్పగా, అలా అయితే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలుపుతూ ఓ నంబర్ ఇచ్చారు.

వృద్ధుడు ఆ నంబర్​కు ఫోన్​ చేయగా, ఓ ప్రముఖ బ్యాంకులో సురేశ్​ అగర్వాల్​ అనే నేరస్థుడు ఖాతాను తెరిచి మనీలాండరింగ్​ చేస్తున్నాడని అవతలి వ్యక్తి బెదిరించారు. ఆ ఖాతాను తెరిచేందుకు మీ వ్యక్తిగత సమాచారం వినియోగించారని చెప్పారు. వాట్సప్​లో ఈడీ, ఐటీ విభాగాల పేరిట లేఖలు పంపించి, మీ ఆస్తులకు మనీలాండరింగ్​కు సంబంధం లేదని నిరూపించుకోవాలని, హిందూ వివాహ చట్టం ప్రకారం మీ భార్య పేరిట ఉన్న ఆస్తులకూ నేరంతో సంబంధం లేదని నిరూపించుకోవాలని చెప్పాడు. ఒకవేళ నేరంతో సంబంధం లేదని దర్యాప్తులో తేలితే, మూడు రోజుల్లో మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పాడు.

ఈ క్రమంలోనే అవసరమైతే కోర్టుకు హాజరవుతామని, ఈ విషయాన్ని మరెవరితోనూ పంచుకోబోమని వృద్ధ దంపతుల నుంచి హామీ కూడా తీసుకున్నాడు. నిబంధనలు ఉల్లంఘిస్తే 3-7 ఏళ్లు శిక్ష తప్పదని హెచ్చరించాడు. ఈ కేసును నవజోత్​ సిమీ అనే మహిళా ఐపీఎస్​ పర్యవేక్షిస్తున్నట్లు చెప్పి, ఫోన్​ పెట్టేశాడు. అప్పటి నుంచి సిమీ పేరుతో ఓ మహిళ ప్రతి రెండు గంటలకు ఒకసారి వృద్ధ దంపతులకు ఫోన్​ చేసి భయపెట్టేది. ఈ కేసులో ఇరుక్కోవద్దంటే రవి అనే ఎస్సై చెప్పినట్లు నడుచుకోవాలని సూచించింది. ఇలా వీడియో కాల్స్​ ద్వారా పోలీసుల వేషధారణలో అనేకమార్లు సైబర్​ నేరగాళ్లు విచారణ చేశారు.

దీంతో భయానికి లోనైన వృద్ధ దంపతులు గత జులై 8 నుంచి 26వ తేదీ వరకు 11 విడతలుగా తమ ఖాతాల్లోని మొత్తం రూ.10,61,50,000లను నేరగాళ్లు సూచించిన ఖాతాల్లోకి ఆన్​లైన్​లో బదిలీ చేశారు. వారు బదిలీ చేసిన వెంటనే నేరగాళ్లు మాట్లాడటం మానేశారు. నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లోనే డబ్బులు తిరిగి ఖాతాలకు బదిలీ చేస్తామని చెప్పి, రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి ఇటీవలే టీజీసీఎస్​బీకి బాధితులు ఫిర్యాదు చేశారు.

రూ.10.61 కోట్లు మ్యూల్‌ ఖాతాలకు తరలింపు : ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వృద్ధ దంపతుల సొమ్ము బదిలీ అయిన బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించారు. అవి చాలా మేర ఉత్తరాదికి చెందినవిగా గుర్తించారు. ఈ మేరకు సిమీ, రవిలతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఖాతాలు ఉత్తరప్రదేశ్​లోని ఝాన్సీ, గోరఖ్​పుర్​, వారణాసిలతో పాటు బెంగళూరు, హరియాణాలోని గురుగ్రామ్​, మణిపుర్​, బిహార్​లలోని పలు ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు. అవన్నీ మ్యూల్​ ఖాతాలుగా తేల్చారు. తొలుత ఆ ఖాతాల్లోకి సొమ్మును బదిలీ చేసుకున్న సైబర్​ నేరగాళ్లు, మళ్లీ ఆ సొమ్మును విడతల వారీగా వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.

మనోళ్లతోనే మనోళ్లకు టోకరా - చైనా దుండగుల సరికొత్త సైబర్‌ దండయాత్ర - Chinese Cyber Fraud With Indians

దోపిడీ కొండంత - రాబట్టేది గోరంత - సైబర్​ మోసాల సొమ్ము రికవరీలో పోలీసుల అలసత్వం - Less Recoveries in Cyber Crimes

ABOUT THE AUTHOR

...view details