ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో అడ్డంగా బుక్కైన SBI మేనేజర్ - దిల్లీ వెళ్లినా నో యూజ్ - CYBER CRIMINALS CHEATED SBI MANAGER

బ్యాంకు మేనేజర్‌ను బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు - మేనేజర్‌ తేరుకునే లోపు డబ్బు విత్‌డ్రా చేసిన మోసగాళ్లు

CYBER CRIMINALS CHEATED SBI MANAGER
CYBER CRIMINALS CHEATED SBI MANAGER (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

CYBER CRIMINALS CHEATED SBI MANAGER: సైబర్‌ మోసాలకు గురికావొద్దంటూ పదే పదే హెచ్చరించే బ్యాంకు సిబ్బందినే బురిడీ కొట్టించారు నేరగాళ్లు. నమ్మకమైన ఖాతాదారుని పేరుతో ఫోన్‌ చేసి, బ్యాంకు చెక్కును వాట్సాప్‌లో ఫొటోతీసి పెట్టి, తొమ్మిదిన్నర లక్షల రూపాయల నగదును బదిలీ చేయించుకున్నారు. అనంతపురంలోని రాంనగర్‌ స్టేట్‌బ్యాంకులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతపురం ఎస్బీఐ మేనేజర్ సైబర్ క్రైం మోసగాళ్ల చేతిలో చిక్కి నగదు బదిలీ చేసిన ఘటన సంచలనంగా మారింది. తాను హోండా షోరూం ఎండీ కవినాథరెడ్డినని, వాట్సాప్​లో చెక్ పెట్టానని, వెంటనే దిల్లీలోని బ్యాంకు ఖాతాకు 9.5 లక్షల రూపాయలు జమచేయాలని చెప్పగానే నగదు బదిలీ చేసేశారు. ధన్వి హోండా షోరూం ఖాతా నుంచి 9.5 లక్షలు డెబిట్ చేసిన మెసేజ్ వెళ్లగానే కంగుతిన్న షోరూం మేనేజర్ పరుగున ఎస్బీఐకి వచ్చారు. అయితే అప్పటికే దిల్లీలోని సైబర్ నేరగాళ్ల ఖాతాకు చేరిన 9.5 లక్షలు విత్ డ్రా చేసేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు. అనంతపురం ధన్వి షోరూం సిబ్బంది, ఎస్బీఐ మేనేజర్​ల తప్పిదంతో సైబర్ క్రిమినల్స్ సొమ్ము కాజేశారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:అనంతపురం రాంనగర్​లోని ధన్వి హోండా బైక్ షోరూంకు సెప్టెంబర్ 10వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను జొమాటో మేనేజర్​గా పరిచయం చేసుకున్నాడు. తమ సిబ్బంది ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి పది బైక్​లు కొనాలని నిర్ణయించినట్లు చెప్పి, కొటేషన్ కావాలని అడిగాడు. జొమాటో పేరుమీద కొటేషన్​తో పాటు క్యాన్సిల్డ్ చెక్​ను పంపించాలని సైబర్ మోసగాడు చెప్పాడు. పది బైక్​లకు ఆర్డర్ వచ్చిందన్న సంతోషంలో, షోరూం మేనేజర్ లెటర్ హెడ్​లో పది బైక్​ల ధర, ఇతర పన్నుల వివరాలను, క్యాన్సల్ చేసిన చెక్కును ఫొటో తీసి జొమాటో మేనేజర్​గా చెప్పిన సైబర్ మోసగాడికి పంపించాడు.

ఖాళీ చెక్కుగా మార్చేసి: షోరూం నుంచి వెళ్లిన క్యాన్సిల్డ్ చెక్కులో షోరూం యజమాని సంతకం అలాగే ఉంచి, అడ్డంగా కొట్టిన గీతలను ఫొటో షాప్ సాంకేతిక పరిజ్ఞానంతో చెరిపేశాడు. సంతకం చేసిన ఖాళీ చెక్కుగా మార్చేశాడు. ఇక బైక్ ధరల వివరాలతో పంపిన కొటేషన్ లెటర్ హెడ్​లో వివరాలను చెరిపేశాడు. తరువాత రాంనగర్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పేరును అభ్యర్థిస్తూ లెటర్ హెడ్​లో మ్యాటర్ టైప్ చేశాడు. ఖాళీ చెక్కుతో పాటు, నగదు బదిలీ చేయాలని ఫేక్ లెటర్ హెడ్​లను ఎస్బీఐ మేనేజర్ అంబ్రీశ్వరస్వామికి పంపించాడు. దానితోపాటు హోండా షోరూం ఎండీ కవినాథరెడ్డి పేరుతో ఫోన్‌ చేసి బలంగా నమ్మించాడు. తాను ధన్వి షోరూం ఎండీనని, తన ఫోన్​లో ఛార్జింగ్ అయిపోవడంతో మరో ఫోన్​తో మాట్లాడుతున్నట్లు చెప్పాడు.

కంగుతిన్న బైక్ షోరూం మేనేజర్: తమ తల్లికి బాగోలేదని, దిల్లీలో ఆసుపత్రిలో చేర్చానని, తమ షోరూం చెక్కును వాట్సాప్ చేసినట్లు చెప్పాడు. తాను అనంతపురం వచ్చిన వెంటనే వాట్సాప్​లో పంపిన చెక్కును మీకు పంపుతానని, నగదు బదిలీ చేయాలని కోరాడు. వాట్సాప్​లో పంపించిన లెటర్ హెడ్, చెక్​ల ఆధారంగా దిల్లీలోని బ్యాంకు ఖాతాకు 9.5 లక్షల నగదు బదిలీ చేశాడు. షోరూం బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ కాగానే, షోరూం మేనేజర్ మొబైల్​కు మెసేజ్ వెళ్లింది. ఖాతా నుంచి నగదు డెబిట్ కావడంపై కంగుతిన్న బైక్ షోరూం మేనేజర్, వెంటనే రాంనగర్ స్టేట్ బ్యాంకు మేనేజరు వద్దకు వచ్చారు. తాము చెక్కు ఇవ్వలేదని, క్యాన్సిల్డ్ చెక్​ను మార్ఫింగ్ చేసి మోసం చేశారని బ్యాంకు మేనేజర్ అంబ్రీశ్వరస్వామికి చెప్పారు. తనకు ఫోన్ చేసిన సైబర్ మోసగానికి బ్యాంకు మేనేజర్ ఫోన్ చేయగా, తాను ఎండీనేనని సమాధానం చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు.

అప్పటికే దిల్లీ ఖాతాకు వెళ్లిన నగదును వెంటనే విత్ డ్రా చేసేశారు. ఈ ఘటన ఈ ఏడాది సెప్టెంబర్​లో జరగగా, బ్యాంకు మేనేజరు దిల్లీ వరకు వెళ్లి విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరక్కపోగా, ఎఫ్​ఐఆర్ లేకపోవడంతో దిల్లీ పోలీసులు కనీసం సహకరించలేదు. దీంతో అన్ని ప్రయత్నాలు చేసి తిరిగొచ్చిన బ్యాంకు మేనేజర్ అంబ్రీశ్వరస్వామి, అనంతపురం నాల్గో పట్టణ పోలీసు స్టేషన్​లో ఈనెల 14వ తేదీన ఫిర్యాదు చేశారు. ఇది కొత్త తరహా సైబర్ క్రైం అని, అనంతపురం నగరంలో ఈ మధ్య చాలా మంది సైబర్ క్రైం బాధితులు తమ వద్దకు వస్తున్నట్లు సీఐ చెప్పారు.

దీనికి సంబంధించి సీఐ సాయినాథ్ కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి బ్యాంకు మేనేజర్ అంబ్రీశ్వరస్వామి, ధన్వి హోండా షోరూం మేనేజర్​ను స్టేషన్​కు రావాలని పిలిచారు. అయితే షోరూం యాజమాన్యం నుంచి పోలీసులకు సహకారం అందటంలేదని సమాచారం.

దిల్లీకి రావాలని బెదిరింపు - నేను రానని చెప్పి యువకుడు!

డిజిటల్‌ అరెస్ట్ అంటూ కాల్ - అలర్ట్ కావడంతో డబ్బు సేఫ్

ABOUT THE AUTHOR

...view details