Prakasam Dist Earthquake Today : ప్రకాశం జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముండ్లమూరు, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లులో వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, గంగవరం, రామభద్రాపురం, శంకరాపురంలో భూప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలోనే ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు.
పలు గ్రామాల్లో రెండు సెకండ్లపాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులన్ని కదిలాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వచ్చామని స్థానికులు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్‌లోని లద్దాఖ్‌లో 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్‌లోని జూమ్లాకు సమీపంలో భూకంప కేంద్రం. భూకంపలేఖినిపై తీవ్రత 5గా నమోదైంది.
Earthquake in Telugu States : మరోవైపు ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, బుట్టయగూడెం, టి.నరసాపురం మండలం బొర్రాంపాలెం, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. 55 సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్ - ఎన్‌జీఆర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలో మీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి.
హైదరాబాద్ నగర పరిధిలోని హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, చర్ల, చింతకాని, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, నాగులవంచ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ముఖ్యంగా గోదావరి నది పరివాహక జిల్లాల్లో తీవ్రత కాస్త అధికంగా ఉంది.