Crops Dried Up In Mahabubnagar District :ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాసంగిలో రైతులు వేసిన పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయి. ఈ ఏడాది 5జిల్లాలు కలిపి 7లక్షల 30వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. వీటిలో అత్యధికంగా 4లక్షల 50వేల ఎకరాల్లో వరి సాగైంది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలోని ఎత్తిపోతల పథకాలపై ఆధారపడే ఎక్కువగా వరి సాగవుతుంది. కానీ యాసంగిలో జూరాల, భీమా, నెట్టెంపాడు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సాగునీరుఇవ్వలేమని ముందుగానే అధికారులు వెల్లడించారు. కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకానికి మాత్రం వారాబందీ విధానంలో మార్చి వరకూ ఆరుతడి పంటలకు సాగునీరు ఇస్తామని తెలిపారు. బోరు బావులపై ఆధారపడి పంటలు వేసిన రైతులు భూగర్భ జలాలను కాపాడుకునే విధంగా అధికారులు కొన్ని సూచనలు చేశారు.
సాగునీటికోసం అన్నదాతల ఆందోళన - పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన
"అనిశ్చిత వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుని రైతులు పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంది. పంట, నీరు, ప్రణాళికలు అమలు పరుచుకోవాలి. ఈ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి. భూగర్భ జలాలు పెంచేందుకు వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేటట్లుగా చూసుకోవాలి. భూగర్బ జలవనరుల యాజమాన్యాన్ని ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది" - రమాదేవి, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి