తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో డిజిటల్ పంటల సర్వే - ఆదిలోనే సమస్యలు మొదలు - CROP DIGITAL SURVEY IN TELANGANA

పంటల సాగును కచ్చితంగా లెక్కించేందుకు డిజిటల్ సర్వే - చరవాణి యాప్​లో సాంకేతిక సమస్యలు.

Crop Survey In Telangana
Digital Crop Survey in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 9:16 AM IST

Digital Crop Survey in Telangana: పంటల సాగును కచ్చితంగా లెక్కించేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ పంటల సర్వే రాష్ట్రంలోని ఆయా జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైంది. మొదటి విడతగా జిల్లాలోని మండలాల వారీగా వ్యవసాయ విస్తరణాధికారి క్లస్టర్‌ పరిధిలోని రెండు వేల ఎకరాలకు మించి ఉన్న గ్రామాన్ని సర్వే చేపట్టాల్సి ఉంది. దీనికి ఉపయోగించే చరవాణి యాప్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం ఇబ్బందిగా మారిందని వ్యవసాయశాఖ విస్తరణాధికారులు వాపోతున్నారు. సర్వే సకాలంలో పూర్తికావడంపై అనుమానాలు ఆదిలోనే వ్యక్తమవుతున్నాయి.

ప్రయోజనాలు అనేకం : ఆన్‌లైన్‌లో పంటల వివరాల నమోదు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పంటల బీమాతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో జరిగే పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగంలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) రూపొందించే లక్ష్యంతో డిజిటల్‌ అగ్రిమిషన్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులకు ప్రయోజనం చేకూరేందుకు, వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచడానికి, ఆధునిక సాంకేతికతను పెంచేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు తెలుపుతున్నారు.

ఆదిలోనే ఆటంకాలు : చరవాణి యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం సంబంధిత అధికారులకు తలనొప్పిగా మారింది. జిల్లా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వాగులు, వంకలు దాటుకుంటూ పొలాల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. తీరా వెళ్లిన తర్వాత అక్కడ సంకేతాల సమస్య తలెత్తడం, ఒక సర్వే నంబరు దగ్గర వేరే రైతుల వివరాలు చూపించడం లాంటివి యాప్‌లో ఏర్పడుతున్నాయి.

పంట వివరాలను నమోదు చేసి చిత్రం తీసిన తర్వాత నిక్షిప్తం చేయడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి మొబైల్ సైతం ఆగిపోతుండటం సర్వేకు ఆటంకంగా మారుతుందని సిబ్బంది తెలిపారు. రైతుల సహాయం తీసుకోకుండా, రెవెన్యూ సిబ్బంది ఎవరూ లేకుండా వ్యవసాయ శాఖ సిబ్బందే సర్వే చేపట్టడం, సర్వేతో పాటు రోజు వారీగా చేసే పనులు ఉండటం ఇబ్బందిగా ఉందని సంబంధిత అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కచ్చితమైన వివరాలు :డిజిటల్‌ పంటల సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చరవాణి యాప్‌ను రూపొందించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో వ్యవసాయ భూముల సర్వే నంబరు, ఉప సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలు, చిత్రాలు తీసి యాప్‌లో నిక్షిప్తం (అప్‌లోడ్‌) చేయాల్సి ఉంటుంది. వ్యవసాయాధికారులు ప్రతి క్షేత్రాన్ని సందర్శించి కచ్చితమైన వివరాలను యాప్‌లో నమోదు చేయాలి.

"చరవాణి యాప్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నది వాస్తవమే. సంకేతాలు లేకపోవడం, సర్వే నంబర్లు తప్పుగా చూపించడం వంటివి క్షేత్ర స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం."-మిలింద్‌కుమార్, వ్యవసాయ సహాయ సంచాలకులు, ఆసిఫాబాద్‌

అన్నదాతలకు గుడ్ న్యూస్ - ఈ యాప్​తో పంట తెగుళ్లు, వైరస్​లను ఇట్టే తెలుసుకోవచ్చు!

రాష్ట్రంలో సిరుల పంట - వరి ధాన్యం దిగుబడిలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ - Rice Crop Yield in Telangana

ABOUT THE AUTHOR

...view details