Crocodile in Kinnerasani Reservoir : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)కు నీటిని సరఫరా చేసే కాల్వల్లో నిత్యం మొసళ్లు ప్రత్యక్షమవుతూ దడ పుట్టిస్తున్నాయి. పర్యాటకులు స్నానాలు చేసే కాల్వల్లో మొసళ్లు సంచరిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. మొసళ్లు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన కేటీపీఎస్ అధికారులు తమకేమీ పట్టనట్లు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పర్యాటకులు వచ్చి స్నానాలు చేయడంతో పాటు తమ పిల్లలను నీటిలో ఆడిస్తూ సంతోషంలో గడుపుతారు. ఈ కేటీపీఎస్ కాల్వలో వేసవికాలం జనాలకు ఈత కొట్టే సరదా చాలా ఎక్కువగా ఉంటోంది.
ఆందోళనలో పర్యాటకులు :ఫిబ్రవరి 7న టోల్‌గేటు సమీపంలో ఓ మొసలి ఈదుకుంటూ కనిపించడంతో దానిని గమనించిన పర్యాటకులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీం హుటాహుటిన ఆ మొసలిని పట్టుకొని మళ్లీ రిజర్వాయర్‌లోనే వదిలారు. మరో మొసలి పిల్ల కాల్వలో ఈదుకుంటూ వెళ్లడాన్ని నేరుగా అటవీ శాఖ అధికారులే ఇటీవల గమనించారు.
కాల్వ మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా నీటి ప్రవాహం తగ్గింది. తద్వారా మొసలి ఈదుకుంటూ వెళ్లడం అక్కడున్న పర్యాటకుల కంటపడింది. వారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అదే నీటి ప్రవాహం అధికంగా ఉంటే మొసలి కన్పించకపోవడంతో పాటు పర్యాటకులకు ఊహించని ప్రమాదం సంభవించేది.
ఫెన్సింగ్ కొంచెం ఎత్తులో నిర్మిస్తే మొసళ్లు రావు :ప్రస్తుతం వేసవి కాలం సమీపిస్తుండటంతో నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. మొసళ్లు రిజర్వాయర్ సమీపంలోని ఒడ్డుకు వచ్చి మెల్లగా కాల్వల్లోకి వెళుతున్నాయి. రిజర్వాయర్ నుంచి బోటు ఉండే ప్రాంతం వరకు ఒడ్డున ఛైన్ లింక్ ఫెన్సింగ్ కొంచెం ఎత్తులో నిర్మిస్తే మొసళ్లు వచ్చే అవకాశం ఉండదు. 1974లో రిజర్వాయర్ సంరక్షణ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు 32 ఆడ, మొగ మొసళ్లను కిన్నెరసాని రిజర్వాయర్లో వదిలారు.