Nitish Kumar Reddy Tirumala Visit:యువ క్రికెటర్ నితీశ్ మరోసారి ఆకట్టుకున్నాడు. అయితే ఈసారి తన బ్యాటుతో మాత్రం కాదు. దేవుడిపై తనకు ఉన్న భక్తితో. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో తిరుమలకు నితీశ్ మెట్లపై వెళ్లారు. అదే విధంగా మోకాళ్ల పర్వతం వద్ద మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లాడు. దీనిని చూసిన నెటిజెన్లు సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు.
కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో (BGT) టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విశాఖ కుర్రాడు, యువ ఆటగాడు నితీశ్ కుమార్‌రెడ్డి తొలి టోర్నీలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సిక్సర్లతో స్టేడియంలో మోత మోగించి సెంచరీతో అదరగొట్టాడు.
ఒకానొక దశలో కష్టాల్లో ఉన్న టీమ్‌ను తన అద్భుత పోరాటంతో మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో 171 బంతుల్లో తన తొలి ఇంటర్నేషనల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ విధంగా ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్ తన తొలి సెంచరీ సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియాలో 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఆ మ్యాచ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ అద్భుత పోరాట పటిమ కనబర్చాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ప్రత్యర్థి బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టాడు. దీంతో వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు 285 బంతులు ఎదుర్కొని 127 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్‌రెడ్డి ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ లిస్ట్‌లో ఇదివరకు అనిల్ కుంబ్లే (ఆడిలైడ్‌లో 87 పరుగులు) టాప్‌లో ఉండగా, తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు.
టీ-20 సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా (ETV Bharat) తాజాగా ఈ యువక్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తిరుమలకు వెళ్లాడు. మెట్లమార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తిరుమల మెట్ల మార్గంలోని మోకాళ్ల పర్వతం వద్ద నితీశ్ మోకాళ్లపై మెట్లెక్కాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మంగళవారం ఉదయం శ్రీవారిని నితీశ్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డిని చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. అతనితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
తిరుపతిలో నితీష్ కుమార్ రెడ్డి: తిరుమల శ్రీవారి దర్శించుకున్న అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ విజయ్ ఆహ్వానం మేరకు తిరుపతిలోని క్రికెట్ క్రీడాకారులతో ఆయన ముచ్చటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించడం మంచి అనుభూతినిచ్చిందన్నారు. రానున్న టీ20- 2025 సీరియస్ కి అదే ఉత్సాహంతో సిద్ధమవుతున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత ముందు క్రీడాకారులు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. నాకు చిన్నప్పటినుంచి విరాట్ కోహ్లీ స్ఫూర్తిదాయకమని నితీష్ తెలిపారు.
టెస్టులో సెంచరీ కొట్టిన నితీశ్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం - రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం
గేమ్ ఛేంజర్‌గా తెలుగు కుర్రాడు నితీశ్- ఇదే కంటిన్యూ చేస్తే ఆ అవార్డు పక్కా!