Amaravati Construction Works :రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సమాయత్తమైంది. ముందుగా నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. అలాగే ఆ ప్రాంతంలో రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం అమరావతిలో విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయలకు వెళ్లే రోడ్లను మొదటి విడతలో నిర్మించనున్నారు. రాజధాని గ్రామాల్లో సీఆర్డీఏ కాంపిటెంట్ అథారిటి కార్యాలయాలు ఏర్పాటవడంతో రైతులు విజయవాడ సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం తప్పింది. ఈ పరిణామాలన్నింటిపై అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయటమే కాకుండా అక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పననూ పక్కన పెట్టారు. గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు. అమరావతిపై కక్షతో అక్కడి ప్రజలను వైఎస్సార్సీపీ సర్కార్ విస్మరించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అమరావతి నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
త్వరలోనే టెండర్ల ప్రక్రియ : ముందుగా సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించారు. ఆ వెంటనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌తో పాటు ఐఏఎస్ అధికారుల భవనాలు, ఉద్యోగుల నివాస సముదాయాల పనులు పూర్తి చేయటానికి టెండర్లు పిలవనున్నారు. రాజధాని నిర్మాణ పనులకు ఇటీవల బడ్జెట్లో రూ.3000ల కోట్లు కేటాయించారు. పెండింగ్ నిర్మాణాలు పూర్తి చేయటంతో పాటు అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సీడ్ యాక్సెస్ రహదారికి అనుబంధంగా 32 రహదారులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడపడితే అక్కడ ఆగిపోయాయి. అలాగే రాజధాని ప్రాంతంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్శిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐడీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి చేరుకునేందుకు సరైన రోడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు వెళ్లే రహదారుల పనులను ప్రారంభించింది.
సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు : అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించారు. వాటి నిర్మాణాలు ప్రారంభం కావాలంటే అక్కడకు చేరుకునే రహదారులు పూర్తి చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ యంత్రాంగం వీటిపై దృష్టి సారించాయి. నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. జనవరి నుంచి అన్ని పనులు పూర్తిస్థాయిలో ఊపందుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం రాజధానిలో చేపడుతున్న పనులపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.