CRDA Started Works in Capital Amaravati at Andhra Pradesh :వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, కూటమి గెలుపుతో కొత్త కళ సంతరించుకోనుంది. ఏపీలో ఎన్డీయే గెలుపు, అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కానుండడంతో సీఆర్డీఏ ఆఘమేఘాలపై పనులు ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో రాజధాని ప్రాంతంలో ముళ్ల కంపల తొలగింపు పనులు మూడు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 ప్రాంతాల్లో 94 పొక్లైన్లతో 109 కిలో మీటర్ల నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.
కరకట్టపై వెలగని విద్యుద్దీపాలను సీఆర్డీఏ సిబ్బంది మారుస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపై రెండు దశల్లో రూ.9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్టును తాజాగా పూర్తి చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. ఇవి ముళ్ల పొదలతో నిండిపోయాయి. వీటిని శుభ్రం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఎన్జీఓ అపార్ట్‌మెంట్లు, విట్ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గం, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయం, నవులూరులోని ఎంఐజీ లేఔట్, స్టేడియం, శాఖమూరు పార్కు, ఎన్‌ఐడీకి వెళ్లే మార్గాల్లో పెరిగిన ముళ్లచెట్లను కూడా తొలగిస్తున్నారు.
AP State Capital Amaravati Works Updates : అమరావతిలో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సీఆర్డీఏ అధికారులతో కలిసి రాజధానిలో దాదాపు రెండు గంటల పాటు పర్యటించారు. ఆగిపోయిన భవన సదుపాయాలు, కట్టడాలను సందర్శించారు. కరకట్ట రోడ్డు నుంచి మొదలుపెట్టి సీడ్‌యాక్సెస్ రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్‌ను పరిశీలించారు. విద్యుద్దీపాల పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తిచేయాలని నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులకు సూచించారు.
AP CS Neerabh Kumar Prasad Visit Amaravati :ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. అక్కడ రాజధానికి భూమిపూజ జరిగిన ప్రాంతం, శంకుస్థాపన శిలాఫలకాలు, పవిత్ర మట్టి, నీరు, అమరావతి నమూనాలు ఉంచిన గ్యాలరీలను సందర్శించారు. అనంతరం సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించి, విజయవాడలోని సీఆర్డీఏ కీలక విభాగాలను ఇక్కడకి తరలించాలని సూచించారు. జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను సీఎన్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.