Amaravati Construction Works Updates : రాజధాని అమరావతిలో శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు(ఏఐఎస్)ల అధికారుల కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ టవర్లలో పెండింగ్ పనులు పూర్తి చేయడంపై సీఆర్‌డీఏ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రూ.524.70 కోట్లతో అంచనాలను సిద్ధం చేసింది. ఇందుకోసం నూతన టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ నుంచి అనుమతి లభించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులకు రాజధాని పరిపాలన నగరంలో, సీడ్ యాక్సెస్ రహదారికి పక్కనే సిల్ట్, ఆపైన 12 అంతస్తులతో (ఎస్+12) 18 టవర్లు నిర్మిస్తున్నారు. 432 అపార్ట్‌మెంట్ యూనిట్‌లు(ఫ్లాట్‌లు) సిద్ధం చేస్తున్నారు. టెండర్లు పిలిచి, పనులు అప్పగించినప్పటి నుంచి తొమ్మిది నెలల్లోగా టవర్లను అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఈ టవర్లపై సీఆర్‌డీఏ రూ.444.05 కోట్లు ఖర్చు చేసింది.
వైఎస్సార్సీపీ నిర్వాకం - రూ.268 కోట్ల అదనపు వ్యయం :వైఎస్సార్సీపీ సర్కార్ అమరావతిపై కక్షగట్టి పనులు నిలిపేసింది. ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు వాటిని మళ్లీ చేపట్టి, పూర్తి చేయాలంటే అంచనా వ్యయం గణనీయంగా పెరుగుతోంది. 18 టవర్ల నిర్మాణాన్ని 2017లో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికే 18 టవర్ల సివిల్ స్ట్రక్చర్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది.
2014-2019 మధ్య వాటి నిర్మాణానికి సీఆర్‌డీఏ రూ.395.65 కోట్లు వెచ్చించింది. ప్రధానంగా క్లబ్‌హౌస్, వాటర్ సంప్, పోడియం వంటి నిర్మాణాలు, ఫ్లోర్‌లు, ఫాల్ సీలింగ్ వంటి ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ పనులు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి పనులు, రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, చిల్లర్ యూనిట్ల ఏర్పాటు వంటి పనులు మిగిలాయి. వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో ఈ పనుల కోసం రూ.80.38 కోట్లు ఖర్చు చేసినట్లుగా చూపించారు.