CRDA Commissioner Kannababu Visit Capital Areas:అమరావతిలో రైతుల ఫిర్యాదులను మొక్కుబడిగా కాకుండా సంతృప్తికరంగా పరిష్కరించాలని అంతే కాకుండా పనులన్నీ సకాలంలో పూర్తవ్వాలని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు చెప్పారు. రాజధానిలోని వివిధ ప్రాంతాలలో అధికారులతో కలసి కమీషనర్ పర్యటించారు. సీఆర్డీఏ (Capital Region Development Authority) కార్యాలయ డిజైన్, నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారుల నివాసల వద్ద నిర్మాణ పనులను, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మించే ఐకానిక్ టవర్స్ వద్ద జరుగుతున్న నీటిని తోడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో వివిధ అంశాలపై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రైతు సమస్యలు, భూసేకరణపై అధికారులను కమీషనర్ అడిగి తెలుసుకున్నారు.
భూసమీకరణలో భూములివ్వని రైతులతో మాట్లాడి వారి అనుమానాలను నివృత్తి చేసి సానుకూలంగా స్పందించేలా చూడాలని డిప్యూటీ కలెక్టర్లను ఆదేశించారు. రాజధాని రైతులకు అందాల్సిన కౌలు, భూమి లేని పేదలకు అందుతున్న పింఛన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో ఎక్కడా అలసత్వం ఉండకూడదని, అధికారులు వీలైనంత వేగంగా, పారదర్శకంగా పని చేయాలని కోరారు.