CPI MLA Kunamneni Demands to Singareni Investigation :విద్యుత్ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయడం బాగానే ఉందని, కానీ సింగరేణిలో జరిగిన అవకతవకలను కూడా బయటపెట్టాలని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యుత్, సింగరేణిని కలిపి విచారణ చేపట్టాలని ఈ రెండింటిని వేర్వేరుగా చూడవద్దని కోరారు.
సింగరేణిలో దాదాపు రూ.10 నుంచి 12 వేల కోట్ల అవినీతి జరిగిందని కూనంనేని ఆరోపించారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పినట్లు, విచారణ కమిటీ వేయాలని అడిగినట్లు గుర్తుచేశారు. ఇదే అంశంపై మళ్లీ సభలో తాజాగా డిమాండ్ చేశారు. శాసనసభలో విద్యుత్ రంగంపై జరుగుతున్న చర్చలో సీపీఐ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్నారు.
"ఒక్క పవర్ప్లాంట్ మాత్రమే కాదు అప్పులో మునిగిపోవటం. విద్యుత్ విభాగంతో పాటు సింగరేణి కూడా తీవ్రమైన అప్పులవైపు, నష్టాల వైపు వెళ్లడానికి ఈ విద్యుత్ ప్రాజెక్ట్లు లేదా జెన్కో కారణమవుతున్నాయి. ఇప్పటికీ కూడా సింగరేణికి దాదాపు 21 వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థ బకాయి ఉంది. విద్యుత్ అంశంపై శ్వేత పత్రం విడుదల చేశారు బాగుంది, కానీ సింగరేణిలో జరిగిన అవకతవకలపై కూడా విచారణ చేపట్టాలి."-కూనంనేని సాంబశివరావు, సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే