CPI NARAYANA ON YS JAGAN ADANI BRIBERY CASE: అదానీ ముడుపుల వ్యవహారం రాష్ట్రంలో, దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కార్పొరేట్ దిగ్గజం అదానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ మోదీకి అనుకూలంగా ఉన్నారన్నారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసు వ్యవహారంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోకూడదన్నారు. 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని లక్ష కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. ఆ ఒప్పందాలను రద్దుచేసి ప్రజలపై భారం పడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నారాయణ కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న నారాయణ ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
CPI RAMAKRISHNA ON ADANI CASE: అదానీ ముడుపుల కేసుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. వందల కోట్ల రూపాయలు చేతులు మారిందనే ఆరోపణల నేపథ్యంలో సీఎం చంద్రబాబు తక్షణం స్పందించి బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని రామకృష్ణ కోరారు. అమెరికా కోర్టు సమన్లు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు.
గుజరాత్ లో యూనిట్ 1.99 రూపాయలకు కొనేందుకు ఒప్పందం చేసుకుంటే ఏపీలో మాత్రం యూనిట్ 2.49 రూపాయలకు కొనేందుకు ఒప్పందం చేసుకోవడం కుట్ర కాదా అంటూ నిలదీశారు. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగి విదేశాల్లో పరువు పోయినా ప్రభుత్వాలు నిర్లిప్తంగా ఉండటం సరికాదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు తక్షణం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు.