Couple established 'Lead Children Library' for Students : వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కాసుల రవికుమార్, శోభారాణి భార్యాభర్తలు. రవికుమార్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఆంగ్ల ఉపాధ్యాయుడు, శోభారాణి నర్సింగ్ పూర్తి చేసి బీఏ ఎల్ఎల్బీ(BA.LLB)చదువుతున్నారు. చిన్నప్పట్నుంచే శోభారాణికి పుస్తకాలు చదవడం అంటే మక్కువ. భర్త సహకారంతో నిరుపేద విద్యార్థులకు మంచి పుస్తకాలు అందించాలన్న ఉద్దేశంతో ఇంట్లోనే 'లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ' ఏర్పాటు చేశారు. నర్సరీ నుంచి గ్రూప్స్(Groups) ప్రిపేర్ అయ్యే విద్యార్థుల వరకు పుస్తకాలు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
గ్రంథాలయానికి వచ్చిన విద్యార్థులకు ఏ పుస్తకాలు చదవాలి, చదవడం ఏ విధంగా అలవర్చుకోవాలి అనే దానిపై అవగాహన కల్పిస్తూనే ఆంగ్లంపై పట్టుసాధించే విధంగా ఆ దంపతులిద్దరు కృషి చేస్తున్నారు. భార్య సహకారంతోనే గ్రంథాలయాలు నిర్వహిస్తున్నామని రవికుమార్ అన్నారు. 2007 నుంచే నిరుపేద విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు సేకరించి లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. చిన్న పిల్లలయితే వారికి కథలు చదివించడం ఆ కథలోని సారాశాన్ని వివరించడం లాంటివి చేస్తున్నామని శోభారాణి చెప్పారు.
'మా మోటో వచ్చి పేదరికానికి చదువే ఆయుధం. నా భర్త ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుడైన ఆయనకు వచ్చే నెలసరి జీతంలో 32 శాతం గ్రంథాలయాల నిర్వహణకు ప్రతి నెల ఖర్చు చేస్తారు. ఇప్పటి వరకు 10 వేల నుంచి 20 వేల బుక్స్ మా దగ్గర ఉన్నాయి. పుస్తకం చదవడం వల్ల ముఖ్యంగా మహిళలు ఆత్మ స్థైర్యం పెరగడంతో పాటు వారు జీవితంలో అన్నింటిని ఎదుర్కొని జీవితంలో నిలబడతారన్నారు.'-శోభారాణి, గ్రంథాలయాల నిర్వాహకురాలు.