Contaminated Drinking Water Problem in AP : కలుషిత జలాలు నగర ప్రజలను కాటేస్తున్నాయి. మురికి కాలువల్లో వేసిన పైపులైన్లు, తప్పుపట్టి పగిలిపోయి లీకేజీల కారణంగా కలుషితమవుతున్న తాగునీరు పట్టణ, నగరవాసుల ఆయువు తీస్తోంది. అనారోగ్యంతో అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. మొన్న గుంటూరు, నేడు విజయవాడలో నిండు ప్రాణాలు బలైనా ప్రభుత్వ యంత్రాంగం మొద్దునిద్ర వీడటం లేదు.
ఇంటింటికి రక్షిత తాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు బుట్టదాఖలయ్యాయి. రాష్ట్రంలో నగర ప్రజలకు సురక్షిత నీరు కరవైంది. కలుషిత నీటితో ప్రజలు ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. తుప్పుపట్టిన తాగునీటి పైపులు ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కలుషిత నీరు తాగి గుంటూరులో ముగ్గురు చనిపోగా 200 మందికిపైగా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం వీడకపోవడంతో విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత జలాలు తాగి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బలయ్యారు. మరో 26 మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఆదోనిలో కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత- ఒకరి పరిస్థితి విషమం - Drinking Contaminated Water
విజయవాడలోని అనేక ప్రాంతాలకు కొద్ది నెలలుగా రంగు మారిన నీరు సరఫరా అవుతోందని ప్రజలు మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. మొగల్రాజపురం పటమటవారి వీధిలో పైపుల్లో వస్తున్న నీరు రంగు మారి దుర్వాసన వస్తోందంటూ ప్రజలు ఫిర్యాదు చేసినా నివారణ చర్యలు చేపట్టలేదు. తుప్పుపట్టిన పైపులైన్లు మార్చేందుకు ప్రయత్నించలేదు. నగర శివారు ప్రాంతాలకు ఇప్పటికీ రంగు మారిన నీరే సరఫరా అవుతోంది. తాగునీటి కుళాయి కనెక్షన్లకు మీటర్లు బిగించడం, ఛార్జీల పెంపుపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపడం లేదు.
తుప్పుపట్టిన పైపులైన్లు, రంగుమారిన నీరు- కలుషిత నీటితో పేదల ప్రాణాలు గాలిలో! (ETV Bharat) దశాబ్దాల క్రితం వేసిన తాగునీటి పైపులైన్లు పూర్తిగా తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఈ ఐదేళ్లలో కనీసం ఒక్కచోట కూడా మార్చలేదు. రాష్ట్రవ్యాప్తంగా 123 పుర, నగరపాలక సంస్థల్లో 18,240 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లలో 40% వరకు పాడయ్యాయి. వీటిలో 5,034 కిలోమీటర్ల మేర అత్యంత అధ్వానంగా ఉన్నాయి. పైపులకు తుప్పుపట్టి రంధ్రాలు పడ్డాయి. అత్యధిక చోట్ల పైపులు మురుగు కాలువల్లో, వాటికి పక్కనే ఉండటంతో ఆ నీరు తాగునీటి పైప్‌లైన్లలో కలిసిపోతోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్యానికి గురై ప్రాణాలు విడుస్తున్నారు.
కలవరపెడుతున్న కలుషిత నీరు - వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరుతున్న బాధితులు - Water Contamination In Vijayawada
తాగునీటి కలుషితానికి తుప్పుపట్టిన పైపులైన్లు ఒక కారణమైతే రిజర్వాయర్లు సరిగా శుభ్రం చేయకపోవడం, బోరునీరు ప్రజలకు నేరుగా సరఫరా చేయడం మరో కారణమని తెలుస్తోంది. నీటి శుద్ధికేంద్రాల నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తుంటారు. వీటిలో నాచు, బురద పట్టకుండా ఆరు నెలలకోసారైనా శుభ్రం చేయాలి. ఇందుకోసం టెండర్లు పిలుస్తున్నా పనులైతే సరిగా జరగడం లేదు. గుత్తేదారులతో ఇంజినీర్లు కుమ్మక్కై మమ అనిపించి బిల్లులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
నదుల్లో నీటి ప్రవాహం తగ్గడం, జలాశయాలు అడుగంటడంతో ఆరేడు నగరాల్లో ఈ ఏడాది వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రత్యామ్నాయంగా బోర్లు తవ్వించి నీటిని నేరుగా రిజర్వాయర్లలో నింపి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. నీటిని శుద్ధి చేయనందున ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. విజయవాడలో పలు ప్రాంతాలకు ఈవిధంగానే నీరు సరఫరా అవుతోంది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు పురపాలక సంఘాల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. అనంతపురం, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇటీవల అనేక మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారు.
కలుషిత నీటి అంశంపై అధికారుల చర్యలు - ఆరుగురు సస్పెండ్, ఇద్దరికి షోకాజ్ నోటీసులు